జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి మృతి | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి మృతి

Mar 6 2026 8:15 AM | Updated on Mar 6 2026 8:15 AM

టేకులపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గోనెల విజయలక్ష్మి(79) గురువారం గుండెపోటుతో పాల్వంచలో మృతి చెందారు. ఆమె మృతదేహన్ని స్వగ్రామమైన టేకులపల్లి మండలం ప్రెగళ్లపాడు పంచాయతీ పరిధి తెలుగూరుకు తీసుకొచ్చారు. కాగా, విజయలక్ష్మి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. 2006లో టేకులపల్లి జెడ్పీటీసీగా ఆమె గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ – సీపీఎం కూటమికి సమానంగా సీట్లు రావడంతో టాస్‌ ద్వారా విజయలక్ష్మికి చైర్‌పర్సన్‌గా అవకాశం దక్కింది. ఆమె భర్త వెంకటనారాయణ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగారు. ప్రత్యర్థుల చేతిలో ఆయన 1991లో హత్యకు గురయ్యారు.

గంజాయి రవాణా కేసులో 20ఏళ్ల జైలుశిక్ష

ఖమ్మంలీగల్‌: గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ముగ్గురికి 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి కె.ఉమాదేవి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం... 2021 ఏప్రిల్‌ 7న రఘునాథపాలెం పోలీసులు వెంకటాపాలెం శివార్లలో తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన 194 కేజీల గంజాయి లభించింది. ఈమేరకు మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం ఆంజనేయులు తండాకు చెందిన బోడ వాల, బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన కొండపల్లి రవితేజ, బొజ్జ వంశీను అదుపులో తీసుకుని విచారించగా ఏపీలోని డొంకరాయి నుండి హైదరాబాద్‌ గంజా యి సరఫరా చేస్తునట్లు అంగీకరించారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జీషీటు దాఖలు చేయగా విచారణలో నేరం రుజువు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌కు సహకరించిన ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, ఏపీపీ జె.శరత్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది సాంబశివరావు, కె.శ్రీకాంత్‌, ఎండీ.ఆయూబ్‌ను పోలీసు అధికారులు అభినందించారు.

చెల్లని చెక్కు కేసులో ఆరు నెలలు...

ఖమ్మం లీగల్‌: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో మహిళకు ఆరు నెలల జైలుశిక్ష విదిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కాసరగడ్డ దీప గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం రాపర్తినగర్‌కు చెందిన నరహరిశెట్టి విజయలక్ష్మి వద్ద కూరపాటి పద్మజ 2018 ఫిబ్రవరిలో రూ.13లక్షల అప్పు తీసుకుంది. ఆపై 2019 మార్చిలో రూ.15లక్షలకు చెక్కు జారీ చేసినా ఆమె ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో విజయలక్ష్మి తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీస్‌ జారీ చేసి కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేసింది. విచారణ అనంతరం పద్మజకు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.15లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement