భద్రాద్రి రామయ్య కల్యాణానికి గోటి తలంబ్రాలతో భక్తులు
పాదయాత్రగా స్వామివారి చెంతకు..
ఏటేటా పెరుగుతున్న ఆధ్యాత్మిక చింతన
కఠోర దీక్షతో తయారీలో పాల్గొన్నాం
భద్రాచలం: దేవుడిపై తమకు గల భక్తిని పలువురు పలు రకాలుగా చూపిస్తుంటారు. కొందరు భజనలు, కీర్తనల ద్వారా నీరాజనం పలుకుతారు. మరి కొందరు ఉపవాసాలు, నిరంతర పూజలతో కొలుస్తుంటారు. తెలుగు వారి ఇలవేల్పుగా, అందరి బంధువుగా కీర్తిస్తున్న భద్రాద్రి రామయ్య దర్శనానికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. శ్రీరామనవమి రోజున స్వామి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి, తలంబ్రాలు స్వీకరించడమే పరమానందంగా భావించే వారు ఒకప్పుడు. కానీ ప్రస్తుతం భక్తులు ఆ తలంబ్రాల తయారీలో భాగస్వాములై రామయ్యపై భక్తిని చాటుకుంటున్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు భక్తులు నిష్టగా గోటితో తలంబ్రాలు వొలుస్తూ, పాదయాత్రగా రామయ్య చెంతకు చేరుస్తుండగా.. వీరి సంఖ్య ఏటేటా పెరుగుతుండడం విశేషం.
ప్రతీ గింజపై శ్రీరామ ఆవాహనం..
సాధారణంగా ఒడ్లను రోట్లో దంచి బియ్యంగా చేస్తారు. కానీ ప్రతీ గింజనూ గోటితో వొలుస్తూ వాటిపై శ్రీరామ నామ ఆవాహనం చేస్తూ కఠోర నిష్టతో యజ్ఞంలా ఈ క్రతువు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోరుకొండకు చెందిన అప్పారావు బృందం దీనికి ఆద్యులు కాగా, ఆ తర్వాత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరించింది. వారు గత రెండు దశాబ్దాలుగా పొలం దున్నడం నుంచి నాట్లు వేసి, కోత కోసి, గోటితో వొలిచే వరకు భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. గత పదేళ్లుగా తెలంగాణలోని పలు జిల్లాల భక్తులు సైతం గోటి తలంబ్రాలు తీసుకొస్తున్నారు. శ్రీరామనవమికి రెండు, మూడు నెలల ముందు నుంచే వరి ధాన్యాన్ని ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు శ్రీరామ నామ స్మరణ చేస్తూ వొలిచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నవమికి ముందు ఆయా గ్రామాల నుంచి కోలాటాలు, పాదయాత్రగా భద్రాచలం చేరుకుని సమర్పిస్తున్నారు. ఆలయ అర్చకులు వీటిని స్వామి వారి చెంత పూజలు చేశాక, కల్యాణ తలంబ్రాలలో వినియోగిస్తారు.
దేవస్థానం నుంచి ఆదరణ అంతంతే..
నియమ నిష్టలు, కఠోర దీక్షతో మండు టెండల్లో కాళ్లకు చెప్పులు సైతం ధరించకుండా రామయ్య చెంతకు వచ్చే వారికి ఆలయంలో దక్కే ఆదరణ తక్కువనే చెప్పాలి. కేవలం ఉచిత దర్శన సౌకర్యం, మధ్యాహ్నం నిత్యన్నదాన ప్రసాదమే సమకూ రుస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అల్పాహారం కల్పించలేకపోతున్నారు. 24 గంటల పాటు నడిచి వచ్చే భక్తులకు ఆలయం ఆధ్వర్యంలో సరిపడా వసతి కల్పించలేకపోతున్నారు. భద్రాచలంలో స్థానిక వస్త్ర వ్యాపారిని సంప్రదించగా ఆయన తన మిత్ర బృందంతో ఆరేళ్లుగా టిఫిన్లు, టీతో పాటుగా మజ్జిగ ఉచితంగా అందిస్తున్నారు. తొలుత 500 మందికి అందించగా, ఈ ఏడాది 5 వేల మందికి నిరంతరాయంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా గ్రామాల్లో భక్తులు సేద తీరేందుకు, బస చేసేందుకు డార్మెటరీ గదులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
గోటి తలంబ్రాలను కఠిన నిష్ట, క్రమశిక్షణతో వొలిచాం. ప్రతీ గింజకు శ్రీరామ నామస్మరణ చేస్తూ పాల్గొన్నాం. సీతారాముల కల్యాణంలో వినియోగించే తలంబ్రాల తయారీలో భాగస్వామ్యం కావటం చాలా సంతోషంగా ఉంది.
– జె.శ్రీలక్ష్మి, మోరంపల్లి బంజర


