ఈ–నామ్‌.. 2.0 | - | Sakshi
Sakshi News home page

ఈ–నామ్‌.. 2.0

Mar 4 2026 7:51 AM | Updated on Mar 4 2026 7:51 AM

● ఖమ్మం మార్కెట్‌లో కొత్త వెర్షన్‌ అమలు ● తద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు ● సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో పూర్తి వివరాలు

అన్నదాతలకు ప్రయోజనం

● ఖమ్మం మార్కెట్‌లో కొత్త వెర్షన్‌ అమలు ● తద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు ● సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో పూర్తి వివరాలు

ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థను మరింత ఆధునీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్‌ 2.0 వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. రైతులకు డిజిటల్‌ మార్కెటింగ్‌ను మెరుగుప ర్చడం, పంట వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాన్ని సులభం చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ–నామ్‌ విధానం అమల్లో ఉన్న వ్యవసాయ మార్కెట్లలో 2.0 వెర్షన్‌ను ప్రవేశపెడుతుండగా జాబితాలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు కూడా చోటు దక్కింది.

2011–12లో ప్రారంభం

రైతులు పండించిన పంటలకు డిమాండ్‌ మేర ధర దక్కేలా చూడడం, మోసాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం 2011–12లో ఎలక్ట్రానిక్‌ బిడ్డింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆనాడే ఖమ్మం మార్కెట్‌లోనూ మొదలైంది. ఆపై 2016లో కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్‌(ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చ ర్‌ మార్కెట్‌) విధానాన్ని ప్రవేశపెట్టగా ఖమ్మం సహా రాష్ట్రంలోని 57 మార్కెట్లలో అమలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్‌ వ్యవస్థను మరింతగా ఆధునికీకరిస్తూ 2.0 వెర్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. పాత వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా మరింత వేగవంతమైన, పారదర్శకమైన ఆన్‌లైన్‌ సేవలు అందనున్నాయి. రైతులు తాము పండించిన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం లభిస్తుందని, అంతర్‌ రాష్ట్ర వాణిజ్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అలాగే, పంట నాణ్యత తనిఖీకి ఏఐ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) సాంకేతికత అందుబాటులో వచ్చి రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

సమస్యలను అధిగమిస్తూ..

వ్యవసాయ మార్కెట్లలో ఈ–నామ్‌ సేవలను అప్‌గ్రేడ్‌ చేసే బాధ్యతను డైరెక్టర్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌ ఇంటిలిజెన్స్‌(డీఎంఐ) పర్యవేక్షణలో ఎస్‌ఎఫ్‌ఏసీ(స్మాల్‌ ఫార్మర్స్‌ అగ్రి బిజినెస్‌ కన్సార్టియం)కు అప్పగించారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఖమ్మం మార్కెట్‌లో 2.0 వెర్షన్‌ అమలవుతుండగా.. ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు.

రైతులకు సమగ్ర సమాచారం

ఈ–నామ్‌ 2.0 ద్వారా రైతు పంట విక్రయాలకు సంబంధించి పూర్తి సమాచారం వారికిఅందుతుంది. గత వెర్షన్‌లో పంటకు లాట్‌ ఐడీ ఇవ్వడం, ఆ లాట్‌ ఆధారంగా బిడ్డింగ్‌, ఎలక్ట్రానిక్‌ కాంటాపై తూకం వంటి ప్రక్రియలు ఉండేవి. ప్రస్తుత వెర్షన్‌లో లాట్‌ ఐడీ ఇవ్వడమే కాక రైతుల ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్లు కూడా అనుసంధానిస్తున్నారు. తద్వారా పంట బిడ్డింగ్‌లో నిర్ణయించిన ధర రైతు ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో చేరుతుంది. అలాగే, విక్రయం తర్వాత తూకం, నిర్ణయించిన ధర, రైతులకు అందే పైకం వివరాలతో పాటు కమీషన్‌ కూడా ఆ మెసేజ్‌లో ఉంటాయి. ఇక తక్‌పట్టీ కూడా జారీ అయ్యే అవకాశం ఉంది.

పత్తి, అపరాల విక్రయాల్లో అమలు

ఖమ్మం మార్కెట్‌లో ప్రధానంగా పత్తి, మిర్చి పంటలతో పాటు పెసలు, కందులు, మినుములే కాక మొక్కజొన్న పంట క్రయవిక్రయాలు కూడా జరుగుతాయి. ఇందులో పత్తి, అపరాల పంటలకు ఇప్పటికే ఈ–నామ్‌ అమలు చేస్తున్నారు. ఇవే పంటలకు ప్రస్తుతం 2.0 వెర్షన్‌ అమలు చేయడం మొదలుపెట్టారు.

కేంద్రప్రభుత్వం రూపొందించిన ఈ–నామ్‌ 2.0 వెర్షన్‌ రైతులకు ఎంతో ప్రయోజనకరం. పంట విక్రయాల్లో పారదర్శకత మరింతగా పెరుగుతుంది. మద్దతు ధర లభించడమే కాక మోసాలకు తావుండదు. ఖమ్మం మార్కెట్‌లో సమర్థంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాం.

– పి.ప్రవీణ్‌కుమార్‌, ఉన్నత శ్రేణి కార్యదర్శి, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement