పుస్తకం ఆవిష్కరణ
ఖమ్మంగాంధీచౌక్: అక్షరాల తోవ సాహితీ సంస్థ 8వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన కథలు, కవితల పుస్తకాన్ని సాహితీవేత్తలు ఆవిష్కరించారు. ఆదివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో అక్షరాల తోవ సాహితీ సంస్థ నిర్వాహకులు నామా పురుషోత్తం అధ్యక్షతన సంస్థ వార్షికోత్సవం నిర్వహించగా.. సంస్థ రూపందించిన కథలు, కవితలు పుస్తకాన్ని, జూలూరుపాడు మండలం పాపకొల్లు ఉన్నత పాఠశాల విద్యార్థి గార్లపాటి కృష్ణమనోహర్ రచించిన ‘ప్రకృతి సాయం’కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాహితీవేత్తలు మువ్వా శ్రీనివాసరావు, వురిమళ్ల సునంద తదితరులు మాట్లాడుతూ.. ఏటా వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు కథలు, కవితల పోటీలను నిర్వహించి ప్రోత్సహించటం మంచి పరిణామం అన్నారు. కార్యక్రమంలో పరిశ సీతారత్నం ట్రస్టు వ్యవస్థాకులు పరిశ పుల్లయ్య, కథా రచయిత మంత్రిప్రగడ శ్రీనివాసరావు, రచయిత్రి తాళ్లూరి లక్ష్మీబాయి, సాహితీవేత్త సయ్యద్ షఫీ, పోతూరి సీతారామారావు, నాయీబ్రాహ్మణ సంఘం ప్రతినిధి యలమందల జగదీశ్ తదితరులు అక్షరాల తోవ సాహితీ సంస్థ కార్యక్రమాలను అభినందించారు. సంస్థ నిర్వాహకులు దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కథల పోటీల విజేతలు ఏనుగంటి వేణుగోపాల్, పొత్తూరి సీతారామరాజు, జడ సుబ్బారావు, మంత్రిప్రగడ శ్రీనావసరావుకు నగదు పురస్కారాలను అందించారు. వక్తృత్వ పోటీల్లో విజేతలకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందించి విద్యార్థులను సన్మానించారు. మూసాపాగి వెంకన్న, మొగిలి గుణకర్, కేవీ చారి, నాగసాయి, మోదుగు గోవిందు, సదానందం, స్వప్నలను సత్కరించారు. దిలావర్, పోతగాని సత్యనారాయణ, కన్నెగంటి వెంకటయ్య, శ్రీనివాస్, సైదులు, రమేశ్, రమణ తదితరులు పాల్గొన్నారు.


