పేదలను రోడ్డుపాలు చేయడం తగదు
● ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ● వారం రోజుల్లో నివేదిక ఇవ్వకపోతే ఢిల్లీకి పిలుస్తామని హెచ్చరిక
ఖమ్మంఅర్బన్: వెలుగుమెట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేత ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఇళ్ల కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించారు. చెట్ల కింద ఆశ్రయం పొందుతున్న కుటుంబాల వారి గోడు విన్నారు. గత 15 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, తమ ఇళ్లకు సౌర విద్యుత్ సదుపాయం కూడా ఏర్పాటు చేసుకున్నామని బాధితులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం హుస్సేన్‌నాయక్ మాట్లాడుతూ.. ముందస్తు నోటీసు లేకుండా ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని, భూదానోద్యమంలో పేదలకు కేటాయించిన భూముల్లో నివసిస్తున్న వారిని రోడ్డుపాలు చేయడం తగదని అన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లు కూల్చివేసే హక్కు అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిన ప్రభుత్వం, ఉన్న ఇళ్లను నేలమట్టం చేయడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణమే అదే స్థలంలో గుడిసెలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఈ ఘటనపై వారం రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని, లేదంటే ఢిల్లీలో విచారణకు పిలిపిస్తామని ఖమ్మం జిల్లా అధికారులకు అల్టిమేటం జారీ చేశారు.


