ఆ... పనులు ముగించండి | - | Sakshi
Sakshi News home page

ఆ... పనులు ముగించండి

Feb 25 2026 7:15 AM | Updated on Feb 25 2026 7:15 AM

ఆ... పనులు ముగించండి

ఆ... పనులు ముగించండి

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభావం

ఉపాధి హామీ పనులకు

డెడ్‌లైన్‌గా మార్చి 15

గడువులోగా పనులు, బిల్లులు

పూర్తిచేయాలని ఆదేశం

మార్పులు అమలైతే ఇబ్బంది

రాకుండా నిర్ణయం

ఖమ్మంమయూరిసెంటర్‌: కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌) పథకం పేరు మార్చడమే కాక అమలులో మార్పులకు సైతం శ్రీకారం చుట్టింది. పథకం నిర్వహణకు సంబంధించి కూలీలకు వేతనాల చెల్లింపు, మెటీరియల్‌ ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉండేలా నిర్ణయించింది. ఇదే సమయాన పథకం పేరును వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గర్‌ అండ్‌ అజీవిక మిషన్‌(వీబీజీరామ్‌జీ)గా మార్చింది. ఈ బిల్లును ఏప్రిల్‌1నుంచి అమల్లోకి రానుండడంతో పెం డింగ్‌ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈజీఎస్‌పథకంకింద చేపట్టిన పనులన్నింటినీ మార్చి 15వతేదీలోగా పూర్తి చేసి, బిల్లులను ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.

పురోగతిలో 24,999 పనులు

ప్రస్తుతం జిల్లాలో చిన్నాపెద్ద అన్నీ కలిపి 24,999 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌ వా డీ కేంద్రాలు, ఇంకుడు గుంతలు, పశువుల షెడ్ల నిర్మాణంతో పాటు రహదారుల వెంట ప్లాంటేషన్‌, కాల్వల ఆధునీకరణ పనులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా సీసీ రోడ్లు నిర్మాణాలకు సంబంధించి 4,373 పనులు, ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి 2,366 పనులు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ప్రకటించిన తేదీలోగా పూర్తి చేసి బిల్లులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

పేరుతో పాటే లెక్కల్లోనూ మార్పులు

ప్రస్తుతం ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పూర్తి వేతనం కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. మెటీరియల్‌ ఖర్చులో కేంద్రం 75 శాతం భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం సమకూరుస్తుంది. అయితే, కొత్త బిల్లు అమలైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు మారనున్నాయి. కూలీల వేతనాలు, మెటీరియల్‌లో 60–40 శాతం వాటాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించనున్నాయి. అలాగే, కొత్త బిల్లు ప్రకారం గ్రామాలను మూడు, నాలుగు కేటగిరీలుగా విభజించి పని దినాలను కేటాయిస్తారు. ఆ లెక్కల ప్రకారమే గ్రామాల్లో కూలీలకు పని కల్పించనుండగా.. తక్కువ పనిదినాలు ఉన్న గ్రామాల్లో కూలీలు మరిన్ని పని దినాలు కోరితే ఆ వ్యయం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.

నిధులు విడుదల

ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనులను పూర్తిచేస్తే వెంటనే బిల్లులను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూర్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనులు పూర్తి చేసుకొని నిధులను సద్వినియోగం చేసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో పెండింగ్‌ పనులు, పురోగతిలో ఉన్న పనులను పూర్తిచేసి వెంటనే బిల్లులను ఆన్‌లైన్‌ చేస్తే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాకాకుండా వీబీజీరామ్‌జీ బిల్లు అమలైతే పెండింగ్‌ పనులకు నిధుల విడుదల ప్రశ్నార్థకంగా మారుతుందని తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉపాధి హామీ పథకం నిధులను వెచ్చిస్తోంది. లబ్ధిదారులకు 90 పని దినాల కూలీ చెల్లిస్తున్నారు. రోజుకు రూ.307 చొప్పున రూ.27 వేలను ఇంటి నిర్మాణ ప్రగతిని ఆధారంగా విడుదల చేస్తున్నారు. జిల్లాలో 2,366 ఇళ్లకు ఈ పథకం అమలవుతుండగా.. ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారులు మార్చి 15లోగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement