వ్యాపారం పేరుతో సైబర్ మోసం..
రూ.549 కోట్ల ఆర్థిక నేరం
కేసులో కదలిక
ప్రధాన నిందితుడు వికాస్ చౌదరితో పాటు మరో ఇద్దరిపై ఇంకో కేసు
వివరాలు వెల్లడించిన
కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్
సత్తుపల్లి: సైబర్ ఆర్థిక నేరాల కేసు విచారణలో మలుపులు తిరుగుతోంది. ఓ కేసు విచారణ చేస్తుండగానే మరో కేసు నమోదు కావడం.. ఇందులో మరో 14 మందిని నిందితులుగా చేర్చడం సంచలనమైంది. రూ.549 కోట్ల సైబర్ క్రైం కేసులో కీలక నిందితులైన ఉడతనేని వికాస్ చౌదరి, బొప్పన నాగప్రియ, అడపా రామవెంకటచరణ్ చౌదరిని విచారిస్తుండగా.. మోసపోయిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇంకో కేసు నమోదు చేసినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పౌరోబి వెల్లడించారు. దీన్ని కూడా పూర్వపు కేసుతో కలిపి విచారిస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం సత్తుపల్లిలో ఆమె వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
14 మంది అరెస్ట్.. ఇంకొందరు పరారీలో
వ్యాపారం పేరుతో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి నిందితులు సైబర్ మోసాలకు పాల్పడ్డారని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పౌరోబి వెల్లడించారు. ఈ మేరకు ఉడతనేని వికాస్ చౌదరి, అడపా రామ వెంకటచరణ్‌చౌదరి, ఇలాసారపు అనిరుధ్, పోట్రు వంశీ, పోట్రు చైతన్యసాయి, దోసపాటి నవీన్, నల్లబోతుల భవాని సత్యశేఖర్, కాపుగంటి జోగేంద్ర, శేషు, దేవళ్ల వేణు, మామిడిశెట్టి సాయికుమార్, పఠాన్ ఇమ్రాన్‌ఖాన్, ఉప్పతల గోపి, దొబ్బల వెంకటేష్‌ను మంగళవారం అరెస్ట్ చేశామని తెలిపారు. ఇక బొప్పన నాగప్రియ, ఇస్లావత్ లక్ష్మీకల్యాణ్, శీలం వేణుగోపాలరావు, నల్లంగుల శ్వేతన్, వీరంశెట్టి వంశీ, బిల్లాసాయి తరుణ్, సంఘం ప్రవీణ్‌కుమార్, భూక్యా తరుణ్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు.
అకౌంట్‌కు రూ.20వేలు
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్, క్రిప్టో కరెన్సీ, ట్రేడింగ్, మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్ల పేర్లతో నిందితులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తేలిందని ఏసీపీ వివరించారు. కరెంట్ అకౌంట్లు తెరిపించి సైబర్ మోసాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. దీని కోసం కొందరికి నెలకు రూ.50వేల జీతం ఇచ్చి అకౌంట్లు తెరిపించడంతో పాటు ప్రతీ అకౌంట్‌కు రూ.20వేలు, అకౌంట్ ఓపెన్ చేసిన వ్యక్తికి రూ.10వేలు ఇచ్చారని తెలిపారు. ఇలా 22 మందితో అకౌంట్లు తెరిపించారని చెప్పారు. కాగా, సైబర్ నేరగాళ్ల లావాదేవీలకు అకౌంట్లు ఇచ్చినా నేరంగా పరిగణిస్తామని, కమీషన్, వేతనం ఆశతో బ్యాంకు అకౌంట్లు ఇచ్చిన వారిని వదిలిపెట్ట బోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో సత్తుపల్లి పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి, ఎస్సై ప్రదీప్ పాల్గొన్నారు.


