నిండా ముంచిన వాన
జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం అర్ధరాత్రి దాటాక అకాల వర్షం కురిసింది. వర్షానికి ఈదురుగాలులు తోడు కావడంతో రైతులపై కోలుకోలేని దెబ్బపడింది. చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పైర్లు నేలవాలాయి. అంతేకాక కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు.
కొణిజర్ల/వైరా రూరల్: వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలంలోని పల్లిపాడు, చిన్నమునగాల, కొత్తకాచారం, పాత కాచారం, కొండవనమాలల్లో ఇరవై రోజుల్లో చేతికి వచ్చే దశలో ఉన్న మొక్కజొన్న నేలకొరగడంతో రైతులు ఆవేదన చెందారు. ఈమేరకు మొక్కజొన్న చేన్లను ఏఓ డి.బాలాజీ మంగళవారం పరిశీలించి ఏఈఓల ద్వారా నష్టం అంచనా వేయిస్తామని తెలిపారు. వైరా రూరల్ మండలంలోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న చేన్లు దెబ్బతినగా కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. ఏఓ మయాన్ మంజుఖాన్ పలు గ్రామాల్లో పంటలను పరిశీలించారు. కాగా, కుండపోత వర్షంతో సోమవరం నల్లకుంట చెరువు అలుగు పోసింది.
● ముదిగొండ/బోనకల్/ఎర్రుపాలెం/చింతకాని: మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలోని వల్లాపురం, యడవల్లి, ముదిగొండ, తదితర గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలవాలింది. బోనకల్ మండలంలో ఖరీఫ్ పంటగా వేసిన పత్తి దెబ్బతినడంతో రైతులు మొక్కజొన్న సాగు చేయగా... నేలవాలడంతో రైతులకు మరోమారు నష్టమే మిగిలింది. కాగా, అఖిలపక్షం నాయకులు మొక్కజొన్న చేన్లను పరిశీలించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న దెబ్బతినడంతో పాటు కల్లాల్లో మిర్చి తడిసింది. ఈమేరకు నారాయణపురం, వెంకటాపురం, సత్యనారాయణపురం, గట్ల గౌరారం గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఏఈవో కూరెళ్ల వంశీకృష్ణ పరిశీలించారు. చింతకాని మండలంలో పలు గ్రామాల్లో కూడా మొక్కజొన్న పంట దెబ్బతినగా అధికారులు సర్వే చేపట్టి పరిహారం అందించాలని రైతులు కోరారు.
● కల్లూరురూరల్/తల్లాడ: సత్తుపల్లి నియోజకవర్గంలో అకాల వర్షానికి కల్లూరు మండలం పెద్దకోరుకొండిలో పలువురు రైతులు ఆరబోసిన మిర్చి కల్లాల్లో తడిసింది. మిర్చి రంగు మారనున్నందున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇక తల్లాడ మండలంలో తల్లాడ, అంబేద్కర్ నగర్, మంగాపురం, కుర్నవల్లి, పినపాక, కేశ్వాపురం, ముద్దునూరు గ్రామాల్లోని కల్లాల్లో ఆరబోసిన మిర్చి వర్షానికి తడిసింది. అలాగే మొక్క జొన్న ఫైరు అకాల వర్షం, గాలికి నేలకొరిగింది.
నిండా ముంచిన వాన
నిండా ముంచిన వాన
నిండా ముంచిన వాన
నిండా ముంచిన వాన


