సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే
వైరా: రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మంగళవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలను వివరించి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతో వారు సానుకూలంగా స్పందించారని ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు లాభాలు
కామేపల్లి: సంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం ఉంటుందని ఆశ్వారావుపేట ఉద్యా న పరిశోధన స్థానం శాస్త్రవేత్త మజ్జిగ శ్రీనివాస్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. కామేపల్లి మండలం బాసిత్‌నగర్‌లో రైతు కర్నాటి వెంకటేశ్వర్లు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ క్షేత్రంలో రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యానవన పంటల్లో ప్రసుత్తం ఆయిల్‌పామ్‌కు మంచి డిమాండ్ ఉండడమే కాక ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందుతున్నాయని తెలిపారు. అంతేకాక అంతర్ పంటల సాగుకు కూడా అవకాశం ఉన్నందున రైతులు ముందుకు రావాలని సూచించారు. సర్పంచ్ బాదావత్ సాజీ, వైరా డివిజన్ ఉద్యాన అధికారి ఆకుల వేణు, ఏఓ తారాదేవి, ఆయిల్‌ఫెడ్ డిప్యూటీ మేనేజర్ శంకర్, ఏఈఓ దీపక్, హెచ్‌ఈఓ సతేంద్ర, శ్రావణి పాల్గొన్నారు.
బీఆర్క్‌లో కృష్ణవేణి
విద్యార్థుల ప్రతిభ
ఖమ్మం సహకారనగర్: జేఈఈ మెయిన్స్ బీఆర్క్ సెషన్–1 ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ చాటారని కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్లు గొల్లపుడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వారు విద్యార్థులను అభినందించాక మాట్లాడారు. ఏ.శశిధర్‌సాయి 99.82, ఏ.మోక్షిత సాయి 99.10, వీఎస్‌ఎస్.లక్ష్మి 99.62, ఎం.సాయి సాత్విక 96.17, టి.సంతోష్‌కుమార్ 95.19, జస్వంత్ సాయి 94.84పర్సంటైల్ సాధించారని వెల్లడించారు. ఈసమావేశంలో ప్రిన్సిపాల్ గుర్రం రామచంద్రయ్య, అకడమిక్ డీన్ ఏలూరి వంశీకృష్ణ, ఏఓ నిరంజన్‌కుమార్ పాల్గొన్నారు.
జీఆర్పీ ఎస్‌ఐగా
వెంకటేశ్వర్లు
ఖమ్మంక్రైం: ఖమ్మం జీఆర్పీ(జనరల్ రైల్వే పోలీస్) ఎస్‌ఐగా సీహెచ్.వెంకటేశ్వర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 2014 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన ఆయన ములుగు జిల్లాలో ఎస్‌ఐగా పనిచేస్తూ జీఆర్పీకి వచ్చారు. ఏడు నెలల క్రితం ఎస్‌ఐగా ఉన్న రాణాప్రతాప్‌ను ఆయన భార్య ఆత్మహత్యకు కారణమనే కేసు నమోదు కావడంతో సస్పెండ్ చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న ఎస్‌ఐ పోస్టులో నియమితులైన వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించాక సీఐ అంజలిని మర్యాదపూర్వకంగా కలిశారు.
అభ్యసన సామర్థ్యాల పరిశీలనలో జాగ్రత్త
ఖమ్మంసహకారనగర్: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పరిశీలించే సమయాన జాగ్రత్తగా వ్యవహరించాలని డీఈఓ చైతన్య జైనీ సూచించారు. రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధనా మండలి రాష్ట్రంలోని 33జిల్లాల్లో విద్యార్థుల సర్వే చేపడుతున్న నేపథ్యాన ఏడుగురు రిసోర్స్ పర్సన్లు హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నారు. ఆపై జిల్లాలో ఎంపిక చేసిన 194 మందికి జిల్లా విద్యా శిక్షణ సంస్థలో శిక్షణ ఇవ్వగా, మంగళవారం ముగింపు సమావేశంలో డీఈఓ మాట్లాడారు. విద్యార్థులకు టాస్క్ షీట్లను చూపిస్తూ ఫలితాలను యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్‌రెడ్డి, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రతినిధి నిహిత్, రిసోర్స్ పర్సన్లు శ్రవణ్‌కుమార్, నాగిరెడ్డి, శేషు, సుస్మిత, ఏసుబాబు, స్వాతి పాల్గొన్నారు.
భార్యపై అనుమానంతో ఆత్మహత్య
రఘునాథపాలెం: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని మంచుకొండకు చెందిన కె.వీరస్వామి(40) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆయన భార్యపై అనుమానంతో మానసికంగా కలత చెందినట్లు సమాచారం. ఈ నేపథ్యాన మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరి వేసుకున్నాడు. ఘటనపై ఆయన సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే


