
మట్టి మేలు తలపెట్టవోయ్ !
ఖమ్మంలో భారీగా ప్రతిమల తయారీ..
అందుబాటులో 5 – 16 అడుగుల
విగ్రహాలు
పర్యావరణ పరిరక్షణకు మేలంటున్న పలువురు
మట్టి విగ్రహాలకు క్రేజ్ పెరుగుతోంది
ఖమ్మంగాంధీచౌక్ : వినాయక ఉత్సవాల్లో పర్యావరణానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలతో అనర్థాలు చోటుచేసుకుంటుండగా.. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల ప్రాధాన్యం పెరిగింది. జిల్లాలో వేల సంఖ్యలో గణపతి ఉత్సవ మండళ్లు ఉండగా, ఒక ఖమ్మం నగరంలోనే 1000కి పైగా మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 27న జరిగే వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఇప్పటికే పలు చోట్ల పీఓపీ విగ్రహాలను విక్రయాలకు సిద్ధంగా ఉంచారు. మరో వైపు నగరంలోని బైపాస్ రోడ్ రాపర్తినగర్. ఇల్లెందు రోడ్ తదితర ప్రాంతాల్లో మట్టి విగ్రహాలు తయారవుతున్నాయి. విగ్రహం మోడల్ ఫొటో చూపిస్తే సిద్ధం చేస్తామని తయారీదారులు చెబుతున్నారు. కొందరు పశ్చిమ బెంగాల్ నుంచి మట్టి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుండగా, మరి కొందరు ఇక్కడే తయారు చేస్తున్నారు.
పీఓపీతో నీటి కాలుష్యం..
గణేష్ ఉత్సవాల సమయంలో రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు విక్రయిస్తుంటారు. నవరాత్రి వేడుకల తర్వాత ఆ విగ్రహాలను నదులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తుండగా నీరు కాలుష్యమై జలరాశులు మనుగడ దెబ్బతింటోంది. తాగునీటి జలాశయాలు కలుషితం అవుతున్నాయి. నీటిలో ప్రయోజనం కలిగించే సూక్ష్మ జీవులు మొదలు.. పెద్ద జీవుల వరకు నశించిపోతున్నాయి.
మట్టి విగ్రహాలే మేలు..
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో అనర్థాలు చోటు చేసుకుంటుండడంతో ప్రత్యామ్నాయంగా మట్టి విగ్రహాలను పర్యావరణవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. పీఓపీ విగ్రహాలతో కలిగే నష్టాలు, మట్టి విగ్రహాలతో ప్రయోజనాలపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో కొందరు బంకమట్టి, వరిపొట్టు, వరిగడ్డి, కలకత్తా నుంచి గంగామట్టిని తీసుకొచ్చి వెదురు బొంగులు, సర్వే కర్రల సాయంతో విగ్రహాలు తయారు చేసి వాటర్ కలర్స్ దిద్దుతున్నారు. ఈ మట్టి విగ్రహాలతో నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఖమ్మంలో తయారుచేసే మట్టి విగ్రహాలకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ, సత్తెనపల్లి, గుంటూరు, కడప నుంచి కూడా ఆర్డర్లు వస్తుండడం విశేషం. ఇక్కడ 5 నుంచి 16 అడుగుల ఎత్తు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. సైజు, రూపాన్ని బట్టి రూ.10 వేల నుంచి ఆపైన ధరలతో విక్రయిస్తున్నారు.
మట్టి గణపతులకు
పెరుగుతున్న ప్రాధాన్యం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యం పెరిగింది. మండప నిర్వాహకులు ఈ విగ్రహాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. పీఓపీతో కలిగే అనర్థాలపై పర్యావరణవేత్తల ప్రచారం కూడా దీనికి దోహదపడుతోంది. ప్రతి ఏటా మట్టి విగ్రహాలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది.
– గూడూరు దయాకర్,
మట్టి విగ్రహాల కేంద్రం నిర్వాహకుడు

మట్టి మేలు తలపెట్టవోయ్ !