
బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సీనియర్ మహిళల, పురుషుల జట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వేజెల్ల సురేష్, బొంతు శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ ఎంపికలకు జిల్లా వ్యాప్తంగా 80 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారని, ఎంపిక చేసిన జట్లను ఈనెల 23, 24 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లా గోలేటిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని వివరించారు. మహిళల జట్టులో జస్వతి, శ్రీహర్షిని, మధులత, అకాంక్ష, సాహితి, రాజేశ్వరీ, కరీనా, మనీషా, స్మైలీ, వ్యూహిత, అక్షయ ఎంపిక కాగా, పురుషుల జట్టులో బి.గోపి, శ్రీకాంత్, పవన్, కళ్యాణ్, మున్నా, నునావత్ గోపి, నవీన్, ప్రశాంత్, లాకేష్, విజయ్, కళ్యాణ్, జయదీప్ చోటు దక్కించుకున్నారని తెలిపారు.
పవర్ డిప్లొమా ఇంజనీర్ల నూతన కమిటీ ఎన్నిక
ఖమ్మంవ్యవసాయం: తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఆదివారం నగరంలోని విద్యుత్ గెస్ట్‌హౌస్‌లో ఎన్నుకున్నారు. అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు ఎం.ఇంద్రసేనారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మల్లికార్జున్, కంపెనీ సలహాదారు మధుసూదన్ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించగా.. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.సుధాకర్‌రెడ్డి ఎలక్షన్ అధికారిగా వ్యవహరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా పి.వెంకట్, కార్యదర్శిగా నాగమల్లేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జె.ప్రభాకర్ రావు, ట్రెజరర్‌గా నాగరాజు, మహిళా ప్రతినిధిగా నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మున్నేరు పరీవాహకంలో పంటల పరిశీలన
ఖమ్మంవ్యవసాయం: వరద ఉధృతి నేపథ్యంలో మున్నేరు పరీవాహక ప్రాంతంలోని పంటలను జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నదీ పరీవాహకంలో వరి పైర్లు దుబ్బుదశలో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎప్పటికప్పుడు పంటలను పర్యవేక్షిస్తూ రైతులకు తగిన సలహాలు అందించాలని స్థానిక వ్యవసాయాధికారులకు సూచించారు. ఆయన వెంట ఖమ్మం అర్బన్ ఏఓ కిషోర్ బాబు, ఏఈఓ దివ్య తదితరులు ఉన్నారు.
రామయ్యకు
సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కిన్నెరసానిలో
పర్యాటక సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసాని ప్రాజెక్ట్ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 619 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.33,310 ఆదాయం లభించింది. 320 మంది బోటు షికారు చేయగా ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.15,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక