వర్సిటీలో ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

వర్సిటీలో ప్రవేశాలు

Aug 18 2025 6:13 AM | Updated on Aug 18 2025 6:13 AM

వర్సిటీలో ప్రవేశాలు

వర్సిటీలో ప్రవేశాలు

నివేదిక ఇంకా రాలేదు..

ఎర్త్‌ సైన్సెస్‌లో తొలిబ్యాచ్‌గా 32 మంది విద్యార్థుల చేరిక విద్యార్థుల సంఖ్య పెంచేందుకు స్పాట్‌ అడ్మిషన్లపై దృష్టి యూనివర్సిటీలో సిద్ధమవుతున్న హాస్టళ్లు, తరగతి గదులు హై పవర్‌ నివేదిక వచ్చాక బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రతిష్టాత్మక డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో దోస్త్‌ ద్వారా విద్యార్థులు అడ్మిషన్‌ పొందారు. వారికి సౌకర్యాలు కల్పించే పనిలో వర్సిటీ పాలనా విభాగం నిమగ్నమైంది. భవిష్యత్‌ అవసరాలకు తగినట్టు క్యాంపస్‌ను తీర్చిదిద్దడంపై దృష్టి సారించింది. యూనివర్సిటీలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో నాలుగు కోర్సులు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో రెండు కోర్సులు ఉన్నాయి. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ విభాగంలో కోర్సుకు 60 సీట్ల చొప్పున 120 సీట్లతో రెండు కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించారు. అన్ని రకాల అనుమతులు వచ్చే సరికి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ (దోస్త్‌) మూడో ఫేస్‌ చివరి దశలో ఉంది. దీంతో మొదటి బ్యాచ్‌లో తక్కువ మంది విద్యార్థులకే అడ్మిషన్లు దక్కాయిు. బీఎస్సీ (జియాలజీ) 10, బీఎస్సీ (ఎన్విరాన్‌మెంట్‌) 22.. మొత్తంగా 32 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్లకు ప్రత్యేక అనుమతులు సాధించే పనిలో యూనివర్సిటీ యాజమాన్యం ఉంది. సీపీగెట్‌ (కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) – 2025 ద్వారా త్వరలో రెండు కోర్సుల్లో పీజీ విద్యార్థులు ఇక్కడికి రానున్నారు.

చకచకా ఏర్పాట్లు

మొదటి బ్యాచ్‌ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీ భవనాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం క్యాంపస్‌లో మార్పులు, చేర్పులు చేపడుతున్నారు. పాత క్యాంపస్‌లో గతంలో ఎంబీఏ, ఎంసీఏ తరగతులు నిర్వహించగా, గదులను ఇటీవల ఆధునికీకరించారు. వీటిలో బీఎస్సీ తరగతులు నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్‌ కాలేజీ పక్కన ఉన్న టీచర్ల క్వార్టర్లను బాలికల హాస్టల్‌గా, ఎన్జీవోస్‌ క్వార్టర్లను బాలుర హాస్టల్‌గా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. క్యాంపస్‌లో అంతర్గత రోడ్లకు మరమ్మతులు, పాత భవనాలకు వైట్‌వాష్‌, అవసరమైన ఫర్నిచర్‌ తదితర ఏర్పాట్లు చేపడుతున్నారు.

స్పోర్ట్స్‌ ఎరేనాకు ప్రతిపాదనలు

కొత్తగూడెం స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌గా, ఆ తర్వాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌గా కొనసాగి న ఈ కళాశాల.. ఇటీవల డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌సైన్సెస్‌ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ అయింది. క్యాంపస్‌ ఒకప్పుడు 391 ఎకరాల్లో ఉండేది. మెడికల్‌ కాలేజీ, ఐడీఓసీ నిర్మాణాలకు కొంత స్థలం తీసుకోగా ప్రస్తుతం 310 ఎకరాల్లో ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఉంది. క్యాంపస్‌లో ఇంజనీరింగ్‌ విభాగంలో 800 సీట్లు ఉండగా, ప్రస్తుతం 650 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా ఎర్త్‌ సైన్సెస్‌ విభాగానికి సంబంధించి 960 మంది విద్యార్థులు రానున్నారు. దీంతో క్యాంపస్‌లో 1,760 మంది విద్యార్థులు అభ్యసించే అవకాశం ఉంది. దీనికి తోడు ఇదే క్యాంపస్‌లో అంతర్భాగంగా ఉన్న మెడికల్‌ కాలేజీలో 600మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది. వీటన్నింటీని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ వరల్డ్‌ క్లాస్‌ స్పోర్ట్స్‌ ఎరేనాను నిర్మించాలనే ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇందులో ఇండోర్‌, ఔట్‌డోర్‌ క్రీడా సౌకర్యాలు, వీక్షకుల కోసం గ్యాలరీలు నిర్మించాలని యోచిస్తున్నారు. అంతకంటే ముందు నిరుపయోగంగా మారిన ఆడిటోరియానికి మరమ్మతులు చేయాలని, పాత బాలుర హాస్టల్‌ను స్టోర్‌రూమ్‌గా మార్చాలని భావిస్తున్నారు.

ఎర్త్‌ సైన్సెస్‌ పీజీ, యూజీ కోర్సుల్లో 360 మంది విద్యార్థులకు విద్యాబోధన జరగనుంది. ఆ తర్వాత పీహెచ్‌డీ విద్యార్థులు కూడా వస్తారు. వీరందరికీ అవసరమైన తరగతి గదులు, ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌, మెస్‌, హాస్టళ్లకు సంబంధించి నూతన భవనాలు నిర్మించాలి. బోధన, బోధనేతర సిబ్బంది ఎంతమంది అవసరం, ఎప్పుడు నియామకాలు చేపట్టాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు. ఈ రెండు అంశాలపై ఉన్నత విద్యాశాఖ హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక వచ్చాక ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీకి సంబంధించిన నూతన భవనాల నిర్మాణం, స్టాఫ్‌ విషయంలో కదలిక వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement