
రైల్వేస్టేషన్‌లో టికెట్ కౌంటర్ ప్రారంభం
చింతకాని : మండల పరిధిలోని నాగులవంచ రైల్వేస్టేషన్‌లో మూడు నెలలుగా నిలిచిపోయిన టికెట్ కౌంటర్ సేవలను ఖమ్మం రైల్వేస్టేషన్ చీఫ్ బుకింగ్ సూపర్‌వైజర్ గంగిశెట్టి శ్రీనివాసులు ఆదివారం ప్రారంభించారు. ప్రయాణికుల నుంచి ఆదరణ తగ్గిందనే కారణంతో నాగులవంచ రైల్వేస్టేషన్‌ను మూసివేస్తున్నట్లు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ బి.సునీత సర్క్యులర్‌ను జారీ చేశారు. దీంతో స్టేషన్‌ను కొనసాగించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టగా తిరిగి యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఈనెల 14న మళ్లీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం టికెట్ కౌంటర్‌ను ప్రారంభించడంతో నాగులవంచ, నాగులవంచ రైల్వేస్టేషన్, పాతర్లపాడు, రామాపురం తదితర గ్రామాల వారు టికెట్లు కొనుగోలు చేసి ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు రైలులోనే ప్రయాణించాలని, తప్పనిసరిగా టికెట్లు కొనుగోలు చేసి స్టేషన్ ఆదాయం పెంచాలని కోరారు. కాగా, కాంట్రాక్ట్ పద్ధతిన కాకుండా రెగ్యులర్ టికెట్ బుకింగ్ క్లర్క్‌ను నియమించాలని, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళ విజయవాడ నుంచి డోర్నకల్ వెళ్లే ప్యాసింజర్ రైలును నాగులవంచ రైల్వేస్టేషన్‌లో నిలపాలని ఆయా గ్రామాల వారు శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఖమ్మం రైల్వేస్టేషన్ కమర్షియల్ సూపర్‌వైజర్ సూరపల్లి శేషుకుమారి, వివిధ పార్టీల నాయకులు బొర్రా ప్రసాద్‌రావు, ఆలస్యం బస్వయ్య, నాగమణి, వెచ్ఛా మంగపతిరావు, మద్దినేని నాగేశ్వరరావు, తేలుకుంట్ల శ్రీనివాసరావు, తాళ్లూరి రాము, కొండా గోపి, మద్దినేని వెంకటేశ్వరరావు, వంకాయలపాటి సత్యం, కొల్లి బాబు, కోపూరి నవీన్, పరిటాల యలమంద, తొండపు వేణు తదితరులు పాల్గొన్నారు.
హర్షం వ్యక్తం చేసిన నాగులవంచ,
పరిసర గ్రామాల ప్రజలు