
మున్నేరు తగ్గుముఖం
సందర్శకులు రాకుండా కట్టుదిట్టం
● ఊపిరి పీల్చుకున్న అధికారులు, ముంపు ప్రాంత ప్రజలు ● శనివారం అర్ధరాత్రి తర్వాత తగ్గిన వరద ● తెల్లవార్లూ పరిశీలిస్తూ అప్రమత్తమైన అధికారులు
ఖమ్మంమయూరిసెంటర్ : రెండు రోజులుగా మున్నేరు వరద ఉధృతి పెరగడంతో భయాందోళనకు గురైన ఖమ్మం ప్రజల్లో ప్రస్తుతం ఊరట నెలకొంది. శనివారం అర్ధరాత్రి వరకు కాల్వొడ్డు వద్ద నీటి మట్టం 15 అడుగుల వరకు పెరిగి భయాందోళన కలిగించింది. అయితే ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి వరద క్రమంగా తగ్గుతూ సాయంత్రం 4 గంటలకు 11 అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. శనివారం ఉదయం 9.5 అడుగుల మేర వరద ఉండగా.. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ఉధృతి పెరగడంతో రాత్రి 8 గంటల వరకు 15 అడుగులకు చేరింది. 15.10 అడుగుల వద్ద సుమారు ఐదు గంటల పాటు నిలకడగా కొనసాగడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. దాదాపు 24 గంటల పాటు పర్యవేక్షణ కొనసాగించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు విభాగాల సమన్వయంతో ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేశారు. అదృష్టవశాత్తూ నీటి మట్టం తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అధికారులు పర్యవేక్షణలోనే..
జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం మళ్లీ పెరగకుండా ఉంటే పెద్దగా ముప్పు ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినా నిర్లక్ష్యం చేయరాదని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బొక్కలగడ్డ, పద్మావతినగర్, వెంకటేశ్వరనగర్ ప్రాంతాలను అధికారులు నిరంతరం సందర్శిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గతంలో జరిగిన నష్టం పునరావృతం కాకుండా శనివారం రాత్రి అంతా మున్నేరు పరీవాహక ప్రాంతంలోనే గస్తీ కాశారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచనలతో అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్, ఎస్‌ఈ రంజిత్‌కుమార్, ఈఈ కృష్ణాలాల్, డీఈ ధరణికుమార్, టీపీఎస్ సంతోష్ మున్నేరు వరదను నిరంతరం పరిశీలిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వరద 13.5 అడుగులకు, రాత్రి 8 గంటలకు 10.5 అడుగులకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మున్నేరుకు వరద పోటెత్తడంతో శనివారం మధ్యాహ్నం నుంచి సందర్శకుల తాకిడి పెరిగింది. కాల్వొడ్డుతో పాటు ప్రకాశ్‌నగర్ వద్ద ప్రజలు మున్నేటి వరదను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు వారిని బ్రిడ్జిపైకి రాకుండా అడ్డుకున్నారు. వరదల సమయంలో మున్నేరు వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.