
యూరియా కోసం అవే పాట్లు
కొణిజర్ల: కొణిజర్ల సొసైటీ కార్యాలయం ఎదుట బుధవారం రైతులు బారులు దీరారు. సొసైటీ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం 15టన్నుల యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు బుధవారం తెల్లవారుజామునే క్యూ కట్టారు. ఒక్కో ఆధార్ కార్డుకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా ఉన్నందున ఆందోళన చెందొద్దని సూచించారు.
ఎస్టీ కమిషన్ సభ్యుడికి నిర్వాసితుల వినతి
ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మంమున్నేటి పరీవాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మిస్తుండగా సరైన పరిహారం ఇవ్వడం లేదని భూములు, ప్లాట్లు కోల్పోతున్న పలువురు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్‌కు విన్నవించారు. ఖమ్మంకు బుధవారం వచ్చిన ఆయనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం నిర్వాసితులు కలిశారు. సుమారు 250 మంది నుంచి 50ఎకరాల భూములను రిటైనింగ్‌వాల్ నిర్మాణానికి సేకరిస్తున్నారని తెలిపారు. మార్కెట్ విలువ లేదా ప్రభుత్వ ధరపై మూడింతల పరిహారం ఇప్పించాలని కోరారు. నాయకులు సన్నె ఉదయప్రతాప్, గల్లా సత్యనారాయణ, నున్న రవికుమార్, రవిరాథోడ్, ఎం.సుబ్బారావు, ఎం.సరస్వతి, శ్యాం, మోహన్, మేకల నాగేంద్ర, రవీందర్, రాజేష్, మల్లేశ్వరి పాల్గొన్నారు.