
ఆకేరు అక్వాడెక్ట్‌కు అడ్డుగా గుట్టలు
● నానాటికీ పెరుగుతున్న వరద ప్రవాహం ● రాకాసితండా వాసుల్లో ఆందోళన
తిరుమలాయపాలెం: జిల్లాలో వర్షం లేకున్నా.. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిస్తే ఆకేరు నదికి వరద పోటెత్తుతుంది. ప్రస్తుతం అదే పరిస్థితి ఉండడంతో.. గత ఏడాది ప్రళయాన్ని తలుచుకుని మండలంలోని రాకాసి తండా వాసులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 1న భారీ వర్షాలు, వరదలతో తండా మునిగిపోగా స్థానికులు సర్వం కోల్పోయారు. అయితే, సీతారామ ప్రాజెక్టు అక్వాడెక్ట్ నిర్మాణంలో కాంట్రాక్టర్ తప్పిదాలతో ఎత్తయిన గ్రామాన్ని వరద ముంచెత్తిందనే ఆరోపణలు వచ్చాయి. వరంగల్ జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురవగా.. మంగళవారం సాయంత్రానికి ఆకేరు వరద పెరిగి సీతారామ ఆక్వాడెక్ట్‌కు తాకుతూ నీరు ప్రవహిస్తోంది. ఆక్వాడెక్ట్ నిర్మాణం పొడవుగానే ఉన్నా సగం కానాలు(నీరు వెళ్లే మార్గాలు) బండరాళ్లతో నిండి, భారీ గుట్ట అడ్డుగా ఉండడంతో నీరు పైకి పోటెత్తే ప్రమాదముంది. గత ఏడాది నుంచి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టకపోవడంతో ఈసారి ఏం జరుగుతుందోనని రాకాసి తండా వాసులు నిత్యావసరాలు, విలువైన వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా తమ గోడు ఆలకించి అక్వాడెక్ట్‌కు అడ్డుగా ఉన్న బండరాళ్లు, గుట్టలను తొలగించాలని కోరుతున్నారు.

ఆకేరు అక్వాడెక్ట్‌కు అడ్డుగా గుట్టలు