
ఆదిలోనే అంతరాయం..
● శిథిలమైన సాగర్ కాల్వలతో ఇక్కట్లు ● పూడికకు తోడు గండ్లతో నీరు సాగక రైతుల ఆవేదన
ఖమ్మం అర్బన్: గతంతో పోలిస్తే ఈసారి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సాగు అవసరాలకు ముందుగానే నీరు విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు సంతోషించారు. కానీ కాల్వల్లో అడ్డంకులు, శిథిలమైన లైనింగ్‌తో చివరి వరకు నీరు చేరే పరిస్థితి లేకపోవడం.. మార్గమధ్యలో గండ్లు పడే ప్రమాదం ఉండడంతో వారి ఆశలు ఆదిలోనే అడియాసలవుతున్నాయి. సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని బ్రాంచ్, మేజర్లు, మైనర్లు అనేకచోట్ల బలహీనంగా ఉండడం.. పూడిక, చెత్త, పిచ్చిమొక్కలతో నిండిపోవడం సాగునీటి సరఫరాకు అడ్డంకిగా మారుతోంది. వేసవిలో శాశ్వత మరమ్మతులు చేయించాల్సి ఉన్నా తాత్కాలిక పనులతోనే సరిపెట్టడంతో ఇప్పుడు నీరు విడుదల చేయగానే లోపాలు బయటపడుతున్నాయి.
గత ఏడాది కూసుమంచిలో..
గతేడాది ఆగస్టు చివరి వారం భారీ వర్షాలతో సాగర్ ప్రధాన కాల్వకు వరద పోటెత్తింది. దీంతో కూసుమంచి వద్ద యూటీ తెగిపోగా భారీ నష్టం జరిగింది. రూ.కోట్లాది నిధులతో మరమ్మతులు చేసి ఇటీవలే నీరు విడుదల చేశారు. ఇంతలోనే వేంసూరు మండలం కుంచపర్తి సమీపాన కాల్వకు ఆదివారం భారీ గండి పడింది. గండి చుట్టూ మట్టి కొట్టుకుపోవడంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే సీజన్ చివరి వరకు నీటి సరఫరా సాఫీగా సాగుతుందా, లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సాగర్ ఆయకట్టు అధికారికంగా 2.54 లక్షల ఎకరాలు ఉండగా.. ఎత్తిపోతల పథకాలతో కలిపి 3లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించాల్సి ఉంది. కానీ కాల్వల దుస్థితి, మరమ్మతు చేయకపోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది.
తాత్కాలిక మరమ్మతులతోనే సరి
గత వానాకాలంలో పాలేరు నుంచి సాగర్ ప్రధాన కాల్వ మీదుగా పలుచోట్ల గండ్లు పడినా తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టారు. ప్రధాన కాల్వతో పాటు బ్రాంచ్, మేజర్లు, మైనర్లలో పూడిక పేరుకుపోవడం, తూములు, షట్టర్లు ధ్వంసమవడం, చెట్లు పెరగడంతో నీటి ప్రవాహానికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఏన్కూరు, కొణిజర్ల, తల్లాడ మండలాల్లో కాల్వల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వంతెనలు శిథిలావస్థలో ఉండగా, రెగ్యులేటరీల షట్టర్లు ధ్వంసమై నీరు సాఫీగా సాగడం లేదు. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులతో సాగర్ కాల్వల ఆధునికీకరణ పనులు చేసినా.. ఆతర్వాత పెద్ద ఎత్తున మరమ్మతులు జరిగిన దాఖలాలు లేవు. కొత్తగా నిధులు మంజూరు కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.