
కాశ్మీర్ లోయలో ప్రమాదం...
● ఆర్మీ జవాన్, జిల్లా వాసి మృతి ● ట్రక్కు లోయలో పడడంతో ఘటన
కారేపల్లి: కారేపల్లి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బానోతు అనిల్‌కుమార్(30) కాశ్మీర్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. విధుల్లో భాగంగా ఆయన సోమవారం కాశ్మీర్ లోయ ప్రాంతంలో వెళ్తుండగా ట్రక్కు లోయలో పడినట్లు తెలిసింది. అనిల్ సహా మరికొందరు ఆర్మీ జవాన్లకు గాయాలు కాగా, ఆయనకు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడని అక్కడి అధికారులు అనిల్ సోదరుడు ప్రసాద్‌కు సమాచారం ఇచ్చారు.
చిన్నప్పటి నుంచే దేశసేవపై మక్కువ..
ఇంటర్మీడియట్ చదివిన అనిల్‌కుమార్‌కు చిన్నప్పటి నుంచి ఆర్మీలో ఉద్యోగం సాధించి దేశసేవ చేయాలని లక్ష్యంగా ఉండేదని స్థానికులు తెలిపారు. 2012లో ఆర్మీలో చేరిన అనిల్ మరో రెండేళ్లయితే రిటైర్డ్ అయ్యేవాడని తెలిసింది. ఆయన తండ్రి మంగీలాల్ కేన్సర్ బారిన పడగా కాపాడేందుకు ఆర్మీ హాస్పిటల్‌లో అనిల్ చికిత్స చేయించినా ఫలితం దక్కక ఏడాది క్రితం మృతి చెందాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అనిల్‌కు భార్య రేణుక, ఎనిమిది నెలల కుమారుడితో పాటు సోదరుడు ప్రసాద్, ఒక సోదరి ఉన్నారు. కాగా, అనిల్ మృతదేహాన్ని మంగళవారం విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో కుటుంబీకులకు అప్పగించనుండగా, అక్కడి నుంచి గ్రామానికి తీసుకొస్తారు. ఈ మేరకు ఆయన భార్య రేణుక, కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.