
నూతన విద్యాపాలసీ దేశానికే ప్రమాదం
ఖమ్మంమయూరిసెంటర్: నూతన విద్యావిధానం దేశానికి అత్యంత ప్రమాదమని, బీజేపీ అధికారంలోకి వచ్చాక కోవిడ్ ముందు నుంచి ఇప్పటికీ 1,800కు పైగా అంశాలను మార్చిందని జీవశాస్త్ర ప్రొఫెసర్, కవి, రచయిత, కవిరాజు త్రిపురనేని రామస్వామి తొలి జాతీయ అవార్డు గ్రహీత దేవరాజు మహారాజు అన్నారు. మానవశక్తి స్థానంలో దైవశక్తిని చొప్పించి అజ్ఞానం వైపు విద్యావిధానాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం 20వ వార్షికోత్సత్సవం సందర్భంగా బోడేపూడి స్మారకోపన్యాసం సావనీర్ ఆవిష్కరణ సందర్భంగా సైన్స్,చరిత్ర పాఠ్యాంశాల మార్పులపై స్థానిక మంచికంటి హాల్‌లో బీవీకే ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన ఆదివారం సెమినార్ నిర్వహించగా ఆయన మాట్లాడారు. జాతీయ విద్యావిధానాన్ని మార్చి అసంబద్ధమైన, అవాస్తవాలతో కూడిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020ని తీసుకొచ్చారని, జీవపరిణామక్రమ సిద్ధాంతాన్నే మార్చాలని చూడడం అవివేకం అన్నారు. ఈ దేశాన్ని హిందూరాష్ట్రంగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.
50 శాతం పన్నులపై స్పందించరేంటి..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మోదీ స్నేహితులు అయినప్పుడు మనదేశ ఉత్పత్తులపై అమెరికా 50 శాతం దిగుమతి సుంకాన్ని విధించినప్పుడు ప్రధాని ఎందుకు స్పందించడం లేదని తమ్మినేని వీరభద్రం అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల వల్ల ఇప్పుడు రైతులు సంక్షోభంలో పడ్డారన్నారు. పాకిస్తాన్‌పై 19%, కొన్నిదేశాలపై 10, 15 శాతం దిగుమతి సుంకాలు మాత్రమే వేసి ఇండియాపై పెద్దమొత్తం పన్ను వేశారని వివరించారు. భారతీయ వ్యవసాయరంగాన్ని నాశనం చేసేలా ట్రంప్ చేస్తున్న ఆగడాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీవీకే ట్రస్ట్ జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.