
పారదర్శకతే లక్ష్యం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో వేల మంది పేదల సొంతింటి కల నెరవేర్చే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. అర్హులను గుర్తించడం నుంచి గృహప్రవేశం వరకు అధికారుల కనుసన్నల్లోనే పనులు జరిగేలా ప్రణాళికాయుతంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో పునాది దశ నుంచి రూఫ్, స్లాబ్, ఇంటి నిర్మాణం.. ఇలా అన్ని దశల్లోనూ వివిధ స్థాయి అధికారులు పరిశీలిస్తూ నిర్మాణ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇందిరమ్మ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతుంది. జిల్లాలో మొదటి దశలో 16,153 ఇళ్లు మంజూరు కాగా.. నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రెండు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే కొన్నిచోట్ల ఫొటోల అప్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవడం, ఇతర కారణాలతో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కావడంలో జాప్యం జరుగుతోంది. వీటిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.
జిల్లాలో 3,48,740 దరఖాస్తులు..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన, మీసేవ, గ్రామసభల ద్వారా 3,48,740 దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఎల్ –1, ఎల్ –2, ఎల్ –3గా విభజించారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేకుండా గుడిసె, రేకులషెడ్, టైల్స్ వేసిన, అద్దె ఇళ్లలో ఉండేవారిని ఎల్ –1(లిస్ట్)గా గుర్తించారు. గుడిసె, రేకులషెడ్, టైల్స్ వేసిన, అద్దె ఇళ్లలో ఉంటూ స్థలం లేనివారిని ఎల్ –2గా, ఇల్లు ఉండి.. తల్లిదండ్రుల నుంచి విడిపోయి మరో ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ – 3 కేటగిరీగా నిర్ణయించారు. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాక ఎల్ –1లో 73,472, ఎల్ –2లో 56,549, ఎల్ –3లో 2,18,719 దరఖాస్తులను విభజించారు. వీటిలో తొలుత 16,153 ఇళ్లు మంజూరు చేశారు.
నిర్ణీత స్థలంలోనే..
ఇల్లు మంజూరైన లబ్ధిదారుడు తన స్థలంలో ముగ్గు పోసుకుంటే పంచాయతీ సెక్రటరీ ఆ స్థలాన్ని ఫొటో తీసి.. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. అకౌంట్ నంబర్, స్థలం వారిదా కాదా అని చెక్ చేస్తారు. ఆ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఒకసారి ఫొటో తీస్తే దాన్ని మార్చే అవకాశం ఉండదు. 400 చదరపు అడుగులు.. అంటే 60 గజాలకు తగ్గకుండా స్థలం ఉండాలి. 45 గజాల్లో నిర్మాణం చేపట్టాలి. నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారా లేదా అనేది పంచాయతీ సెక్రటరీ నిర్ధారిస్తారు.
అధికారుల పర్యవేక్షణ ఇలా..
ఇంటి పునాది నిర్మించాక గ్రామ కార్యదర్శి మళ్లీ లబ్ధిదారుడిని స్థలం వద్ద నిలబెట్టి సైడ్, టాప్, ఫ్రంట్ యాంగిళ్లలో ఫొటో తీసి ఇందిరమ్మ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. దాన్ని ఏఈ పరిశీలించి అప్రూవ్ చేయాలి. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు స్థలం ఉందా లేదా.. బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ సక్రమంగా ఉన్నాయా అని పరిశీలిస్తారు. ఎంత స్థలంలో నిర్మిస్తున్నారనే కొలతలతో పాటు మేసీ్త్ర ఫోన్ నంబర్, పేరు రాసుకుని యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత డీఈ లాగిన్‌లోకి వస్తుంది. ఆయన బేస్‌మెంట్ లెవెల్, స్లాబ్, ఇల్లు పూర్తయ్యాక ఫొటోలు చూసి ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకుని అప్రూవ్ చేస్తారు. అక్కడి నుంచి పీడీ లాగిన్‌కు వస్తుంది. అక్కడ సూపర్ చెక్ చేశాక కలెక్టర్ లాగిన్‌కు వెళ్తుంది. కలెక్టర్ అప్రూవ్ చేశాక ఎండీ లాగిన్‌కు వెళితే.. అక్కడి సెక్షన్ అధికారులు సీజీజీ (సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ఏఐ ద్వారా ప్లేస్‌మెంట్ సరిగా ఉందా.. నిబంధనల ప్రకారం నిర్మాణం ఉందా లేదా అనే వివరాలు పరిశీలిస్తారు. ఇలా అన్ని దశల్లోనూ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది.
జిల్లాలో పకడ్బందీగా
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
దశల వారీగా పరిశీలన..
ఫొటోల అప్‌లోడ్
నిర్మాణం సక్రమంగా ఉంటేనే
నగదు జమ
మొదటి దశలో 16,153 మందికి లబ్ధి
సాంకేతిక చిక్కుముడులు..
ఇటీవల కొందరి ఖాతాల్లో డబ్బు జమ కావడం లేదనే చర్చ సాగుతోంది. చిన్న చిన్న సాంకేతిక సమస్యలతో ఈ ఇబ్బందులు వచ్చినట్లు తెలుస్తోంది. బేస్‌మెంట్ లెవెల్ పూర్తయ్యాక రూ.లక్ష, గోడల నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష, స్లాబ్ పూర్తయ్యాక రూ.2లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష బ్యాంక్ ఖాతాలో జమవుతాయి. కొన్ని ప్రాంతాల్లో కొంత సమయం వరకు యాప్ ఓపెన్ కావడం లేదు. కారేపల్లి మండలం సీతారాంతండా, సత్తుపల్లి మున్సిపాలిటీలోని 2, 15, 22 వార్డుల్లో, కామేపల్లి మండలం బర్లగూడెంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఇంకొన్నిచోట్ల ఆధార్ లింక్ కాకపోవడం, పేరు, అకౌంట్ తప్పుగా ఉండడంతో కొందరి ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. అయితే ఈ సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.