
ఉత్సాహంగా టీటీ ఎంపికలు
ఖమ్మం స్పోర్ట్స్ : ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఎంపికలకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి 120 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ బోర్డులకు ప్రత్యేక హాల్ నిర్మిస్తున్నామని, ప్రతీ క్రీడాకారుడు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేలా రాణించాలని ఆకాంక్షించారు. టీటీ అసోసియేషన్ అధ్యక్షుడు బాలసాని విజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులకు తమ సంఘం ఆధ్వర్యాన పది రోజుల పాటు శిక్షణ ఇచ్చి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు జోజిచాకో, షేక్ ముజాఫర్, పరిటాల చలపతి, రెడ్డి సాయి, శివ, రామారావు పాల్గొన్నారు.
రేపు జాబ్‌మేళా
ఖమ్మం రాపర్తినగర్ : ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ సెంటర్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారిణి ఎన్.మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. అపొలో హోమియో కేర్‌లో 34 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయని, హాజరయ్యే వారికి 18 – 30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. హోమియో కేర్‌లో 30 పోస్టులకు నర్సింగ్, సూపర్‌వైజర్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్, బయోమెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీటెక్ బయోమెడికల్ సబ్జెక్టులో ఉత్తీర్ణులై ఉండాలని వివరించారు.
జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా
ఎస్‌ఈ శ్రీనివాసాచారి వెల్లడి
ఎర్రుపాలెం: జిల్లావ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. మండలంలోని మామునూరు విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన ఐదు మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గృహ, వ్యవసా య వినియోగదారులకు అవసరమైన మేరకు నాణ్యత గల విద్యుత్ అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వైరా డీఈ బండి శ్రీనివాసరావు, మధిర ఏడీఈ అనురాధ, డీఈ భద్రు, ఏఈలు గణేష్, బోజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
రామయ్యకు
సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా నిలిపిన నిత్యకల్యాణాలను పునః ప్రారంభించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం పల్లకీసేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉత్సాహంగా టీటీ ఎంపికలు