
సేవలకు ఇక సెలవ్..!
చింతకాని : మండల పరిధిలోని నాగులవంచ రైల్వేస్టేషన్‌ను త్వరలో మూసివేయనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ బి.సునీత ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా, ఆదివారం వెలుగులోకి వచ్చింది. సుమారు 77 సంవత్సరాలుగా ఎంతో మంది ప్రయాణికులకు సేవలందించిన ఈ రైల్వేస్టేషన్‌కు ప్రయాణికుల నుంచి ఆదరణ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ రైల్వేస్టేషన్‌లో ఇప్పటికే కాంట్రాక్ట్ పొందిన ప్రైవేట్ వ్యక్తి టికెట్లు విక్రయిస్తుండగా.. ఇటీవల అతడు కూడా టికెట్లు ఇవ్వడం లేదు. కాగా, ఈ రైల్వేస్టేషన్‌ను మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించడంతో నాగులవంచ రైల్వేకాలనీ, నాగులవంచ, పాతర్లపాడు, సీతంపేట, చిన్నమండవ, రామాపురం, లక్ష్మీపురం, గోవిందాపురం (ఎల్) గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధికి అప్పటి ఎంపీ నామా నాగేశ్వరరావుకు పాతర్లపాడు గ్రామస్తులు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. రైల్వేస్టేషన్‌ను మరింతగా అభివృద్ధి చేస్తారని ఊహించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.. అసలే మూసివేస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేయడంతో విస్మయం వ్యక్తం చేశారు. మూడో లైన్ ఏర్పాటుతో రైల్వేస్టేషన్‌లో కొత్తగా బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు. అలాగే పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా చేపట్టారు. మూసివేసే స్టేషన్‌కు ఇవన్నీ ఎందుకు చేసినట్టనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, నాగులవంచ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు సేవలు కొనసాగించేలా రైల్వే ఉన్నతాధికారులను కలుస్తామని పాతర్లపాడు గ్రామస్తులు తెలిపారు. రైల్వే శాఖ అధికారులు తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని అంటున్నారు.
త్వరలో నాగులవంచ రైల్వేస్టేషన్
మూసివేత