
ముగిసిన నాటిక పోటీలు
ఖమ్మంగాంధీచౌక్: తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు ఆదివారం ముగిశాయి. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాసంస్థలు తొమ్మిది నాటికలు ప్రదర్శించాయి. సమాజ చైతన్యం, మూఢనమ్మకాలు, కొత్తపోకడలు, పాశ్చాత్య సంస్కృతి వంటి అంశాలపై ప్రదర్శించిన నాటికలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. ఆదివారం హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారు ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటికను ప్రదర్శించారు. జ్యోతిరాజ్ బీశెట్టి రచించిన ఈ నాటికకు డాక్టర్ వెంకట్ గోవాడ దర్శకత్వం వహించారు. ఇక విశాఖపట్టణానికి చెందిన చైతన్య కళాస్రవంతి వారు (అ)సత్యం నాటికను ప్రదర్శించారు. చివరి రోజు నెల నెలా వెన్నెల నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు సీహెచ్.ఎన్. రాజకుమారి హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక విద్యావేత్తలు వంగా సాంబశివరావు, చైతన్య విద్యాసంస్థల అధినేత మల్లెంపాటి శ్రీధర్, హార్వెస్ట్ విద్యాసంస్థల అధినేత రవిమారుత్, నెల నెలా వెన్నెల నిర్వాహకులు ఎ.సుబ్రహ్మణ్యకుమార్, డాక్టర్ నాగబత్తిని రవి, జగన్మోహన్‌రావు, కురువెళ్ల ప్రవీణ్, వేముల సదానందం, నామా లక్ష్మీనారాయణ, వేల్పుల విజేత, మొగిలి శ్రీనివాసరెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.