
నేడు ఇంపు
నాడు కంపు..
ఖమ్మంమయూరిసెంటర్: వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో నిండి, దుర్వాసనతో పరిసర ప్రాంత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం డంపింగ్ యార్డు ఇప్పుడు సరికొత్తగా మారింది. అధికారుల పట్టుదల, ప్రణాళికాయుతమైన కృషి ఫలితంగా ఈ డంపింగ్ యార్డు నేడు ఆహ్లాదకరమైన పచ్చని వనంగా రూపుదిద్దుకుంది. ‘చెత్త పోయి.. మొక్కలు వచ్చె’ అనే నానుడిని నిజం చేస్తూ ఈ ప్రదేశం స్థానికులకు ఆదర్శంగా నిలుస్తోంది. దానవాయిగూడెం డంపింగ్ యార్డు అంటేనే ఒకప్పుడు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. నగరంలోని ఘన వ్యర్థాలన్నీ ఇక్కడికే చేరడంతో నిత్యం కంపు కొడుతూ, పర్యావరణానికి విఘాతం కలిగించేది. దుర్వాసన మాత్రమే కాదు.. దోమలు, ఈగలు వృద్ధి చెందడానికి, భూగర్భ జలాలు కలుషితం కావడానికీ ఇది ఒక ముఖ్య కారణంగా స్థానికులు భావించారు. ఇక నెలలో రెండు, మూడుసార్లు డంపింగ్‌యార్డ్‌లో చెలరేగే మంటలు, పొగతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన పాలకవర్గం, అధికారులు డంపింగ్ యార్డును పునరుద్ధరించాలని సంకల్పించారు.
వేల మొక్కలతో పచ్చదనం..
దానవాయిగూడెం డంపింగ్‌యార్డ్‌లో శుభ్రం చేసిన స్థలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఇప్పటి వరకు 8 ఎకరాల్లో 8 వేలకు పైగా మొక్కలు నాటగా.. మరో రెండు వేల మొక్కలు నాటేందుకు దశల వారీగా కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ పచ్చదనాన్ని పెంచడం ద్వారా వాతావరణాన్ని మెరుగుపరచడమే కాకుండా, డంపింగ్ యార్డుకు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో వివిధ రకాల పండ్లు, పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, క్రమం తప్పకుండా మొక్కలకు నీరందేలా పర్యవేక్షిస్తున్నారు. ఈ కృషి ఫలితంగా నగరంలోని దానవాయిగూడెం డంపింగ్ యార్డు ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతోంది. ఒకప్పుడు చెత్తకుప్పల దిబ్బగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు పక్షుల కిలకిలారావాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిపోయింది. ఈ మార్పు కేవలం పర్యావరణానికే కాదు.. పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి, జీవన నాణ్యతకు కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధికారులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం దేశంలోని ఇతర నగరాలకూ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని అంటున్నారు. కాగా, తమ సమస్యలు తీరాయని ప్రజలు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు.
దానవాయిగూడెం డంపింగ్ యార్డుకు కొత్తరూపం
బయోమైనింగ్‌తో
పదెకరాల స్థలం శుభ్రం
8 ఎకరాల్లో 8 వేలకు పైగా
మొక్కల పెంపకం
ఆహ్లాదకరంగా మారిన
డంపింగ్‌యార్డ్ స్థలం
బయోమైనింగ్‌తో స్థలం శుభ్రం..
డంపింగ్ యార్డ్‌లో దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో తొలగించే కార్యక్రమం చేపట్టారు. 2023 జనవరి నాటికి ఇక్కడ 2.75 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకపోయినట్లు అధికారులు అంచనా వేశారు. 32 ఎకరాల్లో 20 ఎకరాల స్థలాన్ని శుభ్రం చేసే లక్ష్యంతో బయోమైనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2023 జనవరిలో ఈ ప్రక్రియ ప్రారంభించగా.. ఆధునిక యంత్రాలతో వ్యర్థాలను వేరుచేసి, బయోమైనింగ్ ప్రక్రియతో పునర్వినియోగం చేయగల వాటిని రీసైక్లింగ్ యూనిట్లకు తరలించారు. మిగిలిన వ్యర్థాలను సురక్షితంగా డంప్ చేసే ప్రక్రియ పూర్తి చేశారు. పదెకరాలు శుభ్రం చేసేందుకు రెండున్నరేళ్ల సమయం పట్టగా ఈ స్థలాన్ని బయోమైనింగ్ నిర్వాహకులు కేఎంసీ అధికారులకు అప్పగించారు.

నేడు ఇంపు