
సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం
● ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాంట్ల ఏర్పాటు ● ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మంవ్యవసాయం: సోలార్ విద్యుత్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లన్నీ ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుంచే పంపిస్తామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయాల్లో మంచి డిజైన్లు ఉంటే ఆయా కలెక్టర్లు హైదరాబాద్ కు పంపవచ్చని సూచించారు. జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. ఖమ్మం కలెక్టరేట్‌లో పార్కింగ్ షెడ్‌లు సోలార్ ప్యానెళ్లతో నిర్మించామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇరిగేషన్ భూములు, దేవాదాయ భూముల వివరాలు సమర్పించనున్నట్లు వివరించారు. సమీక్షలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసా చారి, ఏడీఈ నాగమల్లేశ్వర రావు, రెడ్కో జిల్లా మేనేజర్ అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.