
సింగరేణి ‘ఫారెస్టు’ అక్రమాల డొల్ల..
● భూపాలపల్లి ఏరియాలో అక్రమాలపై విచారణ పూర్తి ● కలప విక్రయాల్లో రూ.50 లక్షలకు పైగా తేడా ● ఇతర ఏరియాల్లోనూ విచారణకు పెరిగిన డిమాండ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సామాజిక బాధ్యత, సంస్థ అవసరాల మేరకు పని చేయాల్సిన ఫారెస్టు విభాగంపై సింగరేణి యాజమాన్యం దృష్టి సారించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జామాయిల్ చెట్ల నరికివేత, అమ్మకాల విషయంలో కేవలం భూపాలపల్లి సంఘటనే వెలుగు చూసిందని, కానీ వెలుగులోకిరాని నిజాలెన్నో ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
కేవలం భూపాలపల్లి ఘటనపైనే విచారణ
సింగరేణి సంస్థ పరిధిలో 11 ఏరియాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సింగరేణి సంస్థ భారీగా జామాయిల్ చెట్లను పెంచుతోంది. ఏపుగా పెరిగిన చెట్లను నరికి సంస్థ అవసరాల కోసం వినియోగిస్తోంది. చెట్లను నరకడంతో పాటు వాటిని దుంగలు/మొద్దులుగా మార్చి ఇవ్వాల్సిన పనిని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. ఈ క్రమంలో భూపాలపల్లి ఏరియాలో 2018 నుంచి 2020 వరకు జరిగిన లావాదేవీల్లో రూ. 50 లక్షలకు పైగా పక్కదారి పట్టినట్టు సంస్థ విజిలెన్స్ విభాగం దృష్టికి వచ్చింది. దీంతో శాఖాపరమైన విచారణ చేపట్టి నివేదికను సిద్ధం చేశారు. అవకతవకలకు కారణమైన ఉద్యోగులు, అధికారులపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఇతర ఏరియాల్లో విచారణ జరపాలి...
భూపాలపల్లి ఏరియాలో 2018 నుంచి 2020 మధ్య కాలంలో చోటుచేసుకున్న అక్రమాల కారణంగా సంస్థకు రూ. 50 లక్షలకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టుగా తేలింది. సంస్థ పరంగా ఫారెస్టు విభాగంలో పని చేసే అఽధికారుల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు చినికిచినికి గాలివానగా మారడంతో ఈ వ్యవహారం విజిల్ బ్లోయర్ ద్వారా విజిలెన్స్ దృష్టికి వచ్చింది. లేదంటే సంస్థకు రావాల్సిన రూ. 50 లక్షలకు పైగా సొమ్ము రాకుండా పోయేది. ఈ తరహా అవకతవకలు ఇతర ఏరియాల్లోనూ జరిగాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీంతో భూపాలపల్లి తరహాలోనే ఇతర ఏరియాల్లోనూ విచారణ జరపాలనే డిమాండ్లు వస్తున్నాయి. సంస్థ పరిధిలోని అన్ని ఏరియాల్లో కనీసం గడిచిన ఐదేళ్ల కాలంలో ఫారెస్టు విభాగంలో జరిగిన లావాదేవీలపై దృష్టి సారించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కేవలం కర్ర అమ్మకాలే కాకుండా ఎంత విస్తీర్ణంలో కటింగ్ చేయాల్సి ఉండగా ఎంత ఏరియాలో చెట్లను నరికారనే అంశాలపై కూడా దృష్టి పెట్టాలంటున్నారు. దీంతో పాటు భవిష్యత్‌లో చెట్లు నరికే విషయంలో అవకతవకలు జరిగేందుకు వీలులేకుండా పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా కొత్త నిబంధనలు రూపొందించాలంటున్నారు.
పైస్థాయిలో అలా.. కింది స్థాయిలో ఇలా
సామాజిక బాధ్యతగా ఐదు కోట్లకు పైగా మొక్కలు నాటిన సంస్థగా సింగరేణి రికార్డు సాధించింది. 2019లో సంస్థలో డైరెక్టర్ పాగా బాధ్యతలు చేపట్టింది మొదలు ప్రస్తుతం సీఎండీ వరకు రికార్డు స్థాయిలో 20 వేలకు పైగా మొక్కలు స్వయంగా నాటారు. అఖిల భారత స్థాయి అధికారుల్లో ఫారెస్టు వారిని మించి మరీ ట్రీమ్యాన్‌గా గుర్తింపు పొందారు. మరోవైపు ఆ సంస్థ పరిధిలో ఉన్న ఫారెస్టు విభాగం అక్రమాలకు వేదికగా మారడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..?
గనుల్లో బొగ్గును తీసిన తర్వాత ఏర్పడిన గుల్ల ప్రదేశంలో బొగ్గు పొరలు కూలి కిందపడకుండా సపోర్ట్‌గా ఐరన్ రాడ్స్, కలప దుంగలను పెడుతుంటారు. ఇందుకోసమే సింగరేణి సంస్థ వేలాది ఎకరాల్లో యూకలిప్టస్ చెట్లు పెంచుతోంది. జామాయిల్ చెట్టు మొదలు (ప్రోప్), మధ్య (చోక్) భాగాలు సపోర్టింగ్ పిల్లర్లుగా ఉపయోగపడతాయి. చెట్టుపై భాగంలో సన్నగా, పీలగా ఉండే కలప సపోర్టింగ్ పిల్లర్‌గా పనికి రాదు. కానీ పేపర్ పరిశ్రమలకు ఉపయోగపడుతుంది. వీటితో పేపర్ పల్ప్‌ను తయారు చేస్తారు. దీంతో నరికివేసిన చెట్ల నుంచి ప్రధాన అవసరమైన సపోర్టింగ్ పిల్లర్లకు సంబంధించిన కలపను సంస్థకు కాంట్రాక్టరు ముందుగా అప్పగించాలి. ఆ తర్వాత మిగులుగా తేలిన జామాయిల్ చెట్ల పై భాగానికి సంబంధించిన వివరాలను వెల్లడించాలి. అనంతరం వాటిని పేపర్ పరిశ్రమలకు అమ్మి, ఆ మేరకు కమీషన్ తీసుకుని మిగిలిన సొమ్మును సంస్థ ఖాతాలో జమ చేయాలి. భూపాలపల్లి ఏరియాలో మిగులు కర్రను కాంట్రాక్టరుకు అప్పగించారు. అయితే తిరిగి ఎంత సొమ్ము సంస్థఖాతాలో జమైంది అనే వివరాల్లో భారీ అంతరాలు చోటు చేసుకున్నట్టు ఫిర్యాదు అందింది.