
లారీ – బొలేరో వాహనం ఢీ
ఇద్దరికి తీవ్ర గాయాలు
తిరుమలాయపాలెం: బొలేరో వాహనం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున దమ్మాయిగూడెం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా దవళేశ్వరం నుంచి పూల మొక్కల లోడుతో నిర్మల్ వెళ్తున్న బొలేరోను వాహనం దమ్మాయిగూడెం సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే మరిపెడ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో బొలేరో వాహనం డ్రైవర్ ఆకుల లోవరాజు, తోడుగా వచ్చిన బొడ్డుపల్లి ప్రదీప్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బురదలో దిగబడిన లారీ..
సీసీ రోడ్డు సగం వేసి వదిలేయడంతో ఘటన
కారేపల్లి: డోర్నకల్ జంక్షన్ నుంచి కారేపల్లి మీదుగా భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్ వరకు నిర్వహించే డబ్లింగ్ రైల్వే లైన్ ప్రక్రియలో భాగంగా.. పనులు చేపట్టిన రైల్వే అధికారులు ముందస్తుగా రైల్వే ట్రాక్ సిమెంట్ దిమ్మెలను లారీల్లో ట్రాక్‌ల వెంట స్టోర్ చేస్తున్నారు. కాగా, శనివారం కారేపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే కేబిన్ వద్దకు సిమెంట్ దిమ్మెలను తీసుకొస్తున్న లారీ కారేపల్లి ముత్యాలమ్మగుడి, సంత, సింగరేణి ప్రాథమిక పాఠశాలల కూడలి మీదుగా వెళ్తుండగా దిగబడిపోయింది. టైర్లు మొత్తం బురదలో దిగబడడంతో లారీ పూర్తిగా ఓ పక్కకు వాలిపోయింది. ఇటీవల ముత్యాలమ్మగుడి నుంచి డోర్నకల్ బైపాస్ రోడ్డుకు కలిపేందుకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అది సగం వరకు వచ్చి ఆగిపోవడం, మిగతా రోడ్డులో అప్పటికే మట్టిని తొలగించి ఉండడంతో వరద నీరు చేరింది. ఈ క్రమంలో లారీ దిగబడగా.. క్రేన్ సాయంతో సిమెంట్ దిమ్మెలను దింపి లారీని బయటకు తీశారు.

లారీ – బొలేరో వాహనం ఢీ