
నాటక రంగానికి జీవం పోస్తున్నారు..
ఖమ్మంగాంధీచౌక్: నాటక రంగం గొప్పదని, మారుతున్న కాలంలో ఆ రంగాన్ని ఆదరిస్తూ నెల నెలా వెన్నెల నిర్వాహకులు జీవం పోస్తున్నారని సినీ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి అన్నారు. ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నెల నెలా వెన్నెల 8వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాటక రంగం తల్లి లాంటిదని అభివర్ణించారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలను చూస్తుంటే తన తల్లిగారింటికి వచ్చిన ఆనందం కలుగుతోందన్నారు. ప్రతీ నెల నాటికలు నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. నాటకాలకు ప్రసిద్ధిగా ఉన్న ఈ ప్రాంతంతో తెలియని అనుబంధం ఉందని చెప్పారు. సినీ దర్శకులు దశరథ్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా పేరును నలుదిశలా చాటుతున్న నెల నెలా వెన్నెల కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మిత్ర ఫౌండేషన్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, నెల నెలా వెన్నెల నిర్వహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, డాక్టర్ నాగబత్తిని రవి, వేల్పుల విజేత, మోటమర్రి జగన్మోహన్‌రావు, వేముల సదానందం, నామా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అనంతరం సీనియర్ కళాకారుడు కన్నబోయిన అంజయ్యను తనికెళ్ల భరణి సత్కరించారు. కాగా, విజయవాడకు చెందిన న్యూ స్టార్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన ‘ఐ ఏట్ ఇండియా’ నాటిక ప్రేక్షకులను అలరించింది.
నెలనెలా వెన్నెల నిర్వాహకులకు
తనికెళ్ల భరణి అభినందన