
‘సైబర్’ ముఠాలో వేదాంతపురం వాసి
● ఉపాధి కోసం కాంబోడియా వెళ్లిన అన్నదమ్ములు ● మంచిర్యాల జిల్లా వాసికి డబ్బు ఎరవేసిన ఒకరు ● ఆపై జన్నారం కేంద్రంగా సైబర్‌నేరాలు
అశ్వారావుపేటరూరల్: అమాయకులను నమ్మించి రూ.కోట్లలో కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వేదాంతపురం గ్రామవాసి ఉన్నట్లు బయటపడడం సంచలనం కలిగించింది. కొద్ది రోజులుగా పరారీలో నిందితుడి కోసం సైబర్ సెక్యూరిటీ బ్యూరో బృందం అధికారులు గ్రామంలో గురువారం రాత్రి విచారణ చేపట్టిన విషయం శుక్రవారం వెలుగుచూసింది.
అక్కడ పట్టుబడడంతో..
మంచిర్యాల జిల్లా జన్నారం కేంద్రంగా పెద్దత్తున సైబర్ నేరాలు జరుగుతున్నట్లు సమాచారం అందగా గత నెల 30వ తేదీన పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. విచారణలో అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన అన్నదమ్ముల్లో ఒకరు ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు గుర్తించారు. ఆయన కోసం సైబర్ సెక్యూరిటీ బ్యూరో బృందం గాలిస్తుండగా గురువారం రాత్రి గ్రామంలోని వారి నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్నదమ్ములు తక్కువ సమయంలోనే ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్లు గుర్తించారని సమాచారం.
వేదాంతపురం టు కాంబోడియా
పదో తరగతి, ఇంటర్ అభ్యసించిన వేదాంతపురానికి చెందిన అన్నదమ్ములు మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కాంబోడియా దేశానికి వెళ్లారు. వీరిద్దరు అక్కడ హోటల్‌లో పనిచేస్తుండగా ఒకరికి సైబర్ నేరగాళ్లతో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. వారి నుంచి యంత్రాలు సమకూర్చుకున్నట్లు సమాచారం. ఆపై మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడగా.. సదరు వ్యక్తి స్వగ్రామానికి వెళ్లే క్రమాన సైబర్ నేరాలతో రూ.కోట్లు సంపాదించవచ్చని ఆశ చూపాడని తెలిసింది. నేరాల్లో ఉపయోగపడే యంత్రాలను తీసుకెళ్లాలని సూచించగా సదరు వ్యక్తి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆపై కాంబోడియాలో ఉన్న ప్రధాన నిందితుడి సూచనల మేరకు జన్నారంలోని బంధువుల ఇంట్లో గది అద్దెకు తీసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు ఢిల్లీకి చెందిన టెలీ కమ్యూనికేషన్ శాఖ అధికారులు గుర్తించారు. ఈమేరకు జన్నారంలో ముఠాను పోలీసులు అరెస్ట్ చేయగా.. సూత్రధారి వేదాంతపురం వాసి అని తేలడంతో సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై అశ్వారావుపేట ఎస్సై యయాతిరాజును వివరణ కోరగా.. సైబర్ నేరం ఘటనలో వేదాంతపురం వాసిపై మంచిర్యాల జిల్లాలో కేసు నమోదైందని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బృందం విచారిస్తుండగా.. తమ పరిధిలో లేదని వెల్లడించారు.