
విత్తకుండానే పంట పండింది!
ముదిగొండ: రబీలో ఆరు తడి పంటల సాగు మంచిదన్న వ్యవసాయశాఖ అధికారుల సూచనలతో ఓ ఆదర్శ రైతు గడిచిన రబీలో మూడెకరాల్లో పెసర సాగు చేశాడు. అదేస్థలంలో రెండు పంట కూడా తీసిన సదరు రైతు ఔరా అనిపించాడు. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన ఆదర్శ రైతు జూలకంటి సంజీవరెడ్డి గత 30ఏళ్లుగా పంట మార్పిడి విధానం పాటిస్తూ ఆరు తడి పంటలు సాగు చేస్తున్నాడు. గత రబీలోనూ మూడెకరాల్లో పెసర సాగు చేశాడు. బోరు సాయంతో నీరందించగా 20క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే, పంట తీసిన కొద్దిరోజులకే చేనును బోరు నీటితో తడిపాడు. దీంతో వారం వ్యవధిలోనే రాలిన గింజల ద్వారా మళ్లీ పెసర మొక్కలు మొలకెత్తాయి. ఆపై చీడపీడలు ఆశించకుండా కాపాడడంతో ఇటీవల పది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో క్వింటా పెసలకు రూ.7వేల నుంచి రూ.8వేల ధర ఉండగా.. ఒకేసారి విత్తనంతో రెండు పంటలు తీసిన సంజీవరెడ్డిని పలువురు అభినందిస్తున్నారు.

విత్తకుండానే పంట పండింది!