
మాయమాటలతో కాంగ్రెస్ గారడీ
ఖమ్మం మామిళ్లగూడెం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలతో గారడీ చేస్తూ పాలనను గాలికొదిలేసిందని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చి వాటి అమలును గాలికొదిలేశారని ఆరోపించారు. రైతుల రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోగా, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందడం లేదని, నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని, కేంద్రం నిధులు ఇస్తుంటే.. కాంగ్రెస్ శ్రేణులకు ఇళ్లు కేటాయిస్తున్నారని సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళా నాయకులు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈసమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు గెంటెల విద్యాసాగర్, సన్నె ఉదయ్‌ప్రతాప్, గోంగూర వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, నున్నా రవికుమార్, అల్లిక అంజయ్య, మండడపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకుడు సుధాకర్‌రెడ్డి