
కీలకమైన పనుల్లో జాప్యం
● ‘మంచుకొండ లిఫ్ట్’ వద్ద మొదలుకాని సబ్‌స్టేషన్ నిర్మాణం ● ఇది పూర్తయితేనే నడవనున్న మోటార్లు
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని సాగు భూములకు సాగర్ జలాలు చేరేలా రూ.66 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మంచుకొండ ఎత్తిపోతల పథకం కీలక పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ప్రధాన పైపులైన్ ఏర్పాటుచేయడంతో పాటు మోటార్లు అమర్చి ట్రయల్ రన్ చేపట్టగా విజయవంతమైంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ నడుస్తుండడంతో రైతులు పైప్‌లైన్ పనులకు అభ్యంతరం చెబుతున్నా అధికారులు నచ్చచెబుతూ ముందుకు సాగుతున్నారు. కానీ పథకానికి కీలకమైన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం మొదలుకాకపోవడం గమనార్హం. సబ్‌స్టేషన్ నిర్మాణానికి జలవనరుల శాఖ రూ.2.53 కోట్లు కేటాయించినా నిధులు విద్యుత్ శాఖకు చేరితేనే పనులు ప్రారంభం కానున్నాయి. తాత్కాలికంగా విద్యుత్ లైన్లు వేస్తే మోటార్లు నడిచే పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు.
రెండు మోటార్లు.. 36 చెరువులు
ఎత్తిపోతల పథకం ద్వారా తొలుత 27 చెరువులకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వపై నిర్మిస్తున్న ఈ పథకం ద్వారా మంచుకొండ వరకు 9 కి.మీ. ప్రధాన పైపులైన్.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఐదు లింక్ చానళ్లు పైపులైన్లతో చెరువులకు నీరు సరఫరా చేయాలనేది పథకం ప్రధాన ఉద్దేశం. ఈమేరకు పైప్‌లైన్ల పనులు తుది దశకు చేరగా.. పాపటపల్లి, బూడిదంపాడు, ఈర్లపూడి, గడ్డికుంట తండా, రఘునాథపాలెం చెరువులకు నీరు చేరనుంది. ఆపై ఈర్లపూడి పైపులైన్‌ను పొడిగించి పంగిడి వరకు మరో తొమ్మిది చెరువులకు నీరు చేర్చే పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ వ్యవసాయ సీజన్‌లోనే చెరువులకు నీరు సరఫరా చేస్తామని ప్రకటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. పనుల్లో జాప్యంతో ఇటీవల అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎత్తిపోతలు మొదలు పెట్టాలంటే మోటార్లు నడవడానికి కీలకమైన సబ్‌స్టేషన్ పనులు ప్రారంభం కాకపోవడంపై ఆయన ఆరా తీసినట్లు సమాచారం. ఇకనైనా అవసరమైన నిధులను విద్యుత్ శాఖకు కేటాయించి యుద్ధప్రాతిపదికన సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తేనే రెండు మోటర్ల ద్వారా తొలుత ప్రతిపాదించిన 27 చెరువులే కాక మండలంలోని మొత్తం 36 చెరువులకు సాగర్ జలాలు చేరే అవకాశం ఉంది.