
పశువుల పరిహారం స్వాహాపై విచారణ
తిరుమలాయపాలెం: గత ఏడాది వచ్చిన భారీ వరదతో మండలంలోని రాకాసితండాకు చెందిన పలువురు రైతులకు సంబంధించి పశువులు మృతి చెందాయి. వీటికి సంబంధించి పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలపై అధికారులు విచారణకు శ్రీకారం చుట్టారు. ఓ రైతు పేరిట మంజూరైన నగదు వెటర్నరీ డాక్టర్ భర్త ఖాతాలో జమ కావడం, వీటిని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వ్యవహారం బయటపడింది. ఈ అంశంపై ‘సాక్షి’లో ఇటీవల ‘పశువుల పేరిట నిధుల స్వాహా’ కథనం రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ నేతృత్వంలో డీటీ శర్మ, పశుసంవర్థక శాఖ ఏడీ బోడేపూడి శ్రీనివాసరావు, జిల్లా వెటర్నరీ కార్యాలయ మేనేజర్ స్వర్ణలత గురువారం రాకాసితండాలో విచారణ చేపట్టారు. గత ఏడాది భారీ వరదతో 75 మంది రైతుల పశువులు, మేకలు, కోళ్లు చనిపోయినట్లు నిర్ధారించి రూ.55 లక్షల పరిహారం విడుదల చేశారు. అయితే, మండల వెటర్నరీ అధికారి అనూష ఇంటింటా పరిశీలిస్తూ నష్టాన్ని అంచనా వేయకుండా ఆమె భర్త సాయికుమార్‌కు పని అప్పగించడంతో ఆయన అక్రమాలకు తెరలేపినట్లు సమాచారం. ఈక్రమాన అధికారుల విచారణలో స్థానికులు ఎవరి జీవాలు ఎన్ని మృతి చెందాయో చెప్పలేకపోగా, గ్రామంలో లేని వారికి సైతం పరిహారం మంజూరైనట్లు బయటపడింది. దీంతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు, ఆధార్‌కార్డుల పరిశీలనకు నిర్ణయించారు. ఈక్రమంలోనే వెటర్నరీ డాక్టర్ అనూషను రికార్డు సమర్పించాలని సూచించడమే కాక లబ్ధిదారుల ఎంపికలో ఆమె భర్త ప్రమేయంపైనా డీఆర్‌ఓ ప్రశ్నించారు.
వెటర్నరీ డాక్టర్ భర్త కనుసన్నల్లోనే
అక్రమాలు?

పశువుల పరిహారం స్వాహాపై విచారణ