
చర్చించండి.. పరిష్కరించండి
పెద్దాస్పత్రిని వేధిస్తున్న సౌకర్యాల కొరత
● వేతనాలు అందక తరచుగా కార్మికుల సమ్మె ● ‘ప్రైవేట్’కు వెళ్తేనే ఎంఆర్‌ఐ సేవలు ● నేడు కలెక్టర్ అధ్యక్షతన ‘హెచ్‌డీఎస్’ సమావేశం
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి కొన్నేళ్లుగా తాకిడి పెరిగింది. నిత్యం 1,500 నుంచి 2వేల వేల మంది వైద్యసేవలకు వస్తుండగా వారి సహాయకులతో పాటు వైద్యులు, సిబ్బంది సుమారు 5వేల మంది రాకపోకలు సాగింటారు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నా నామమాత్రపు సౌకర్యాలు, పరికరాలతో ఆశించిన స్థాయిలో వైద్యం అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. పెద్దాస్పత్రికి అనుసంధానంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయటంతో వైద్య విధాన పరిషత్ పరిధి నుండి 2023 నవంబర్‌లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ పరిధిలోకి వెళ్లింది. దీంతో నిపుణులైన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించినా రోగులకు నామమాత్రపు సేవలే అందుతుండడం గమనార్హం. కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన శుక్రవారం(నేడు) పెద్దాస్పత్రిలో హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ(హెచ్‌డీఎస్) ముందస్తు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆస్పత్రి సమస్యలు, వైద్యసేవల్లో లోటుపాట్లపై చర్చించి పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
ఎంఆర్‌ఐ సేవలకు ఎదురుచూపు
పెద్దాస్పత్రిలో ఏళ్లుగా ఎంఆర్‌ఐ సేవలు అందని ద్రాక్షలానే మారాయి. నిత్యం 50 మందికి పైగా ఇన్‌పేషంట్లు చేరుతుండగా, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తాకిడి ఉంటోంది. ఎక్స్‌రే, సిటీ స్కాన్ అందుబాటులో ఉన్నా ఎంఆర్‌ఐ సేవలు ప్రతిపాదనలకే పరిమితం కావడంతో అవసరమైన వారు బయటి సెంటర్లలో రూ.3వేల నుండి రూ. 10వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది.
తీరని కార్మికుల వేతన సమస్య
ఆస్పత్రి కార్మికులకు నెలనెలా వేతనాలు అందడం లేదు. ఆస్పత్రి వీవీపీ పరిధిలో ఉన్నప్పుడు 575పడకలకు అనమతి ఉంది. ఆ లెక్క ప్రకారం పేషంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికుల వేతనాల కోసం ఏజెన్సీకి ప్రభుత్వం రూ. 50 లక్షలు చెల్లించేది. కానీ డీఎంఈ పరిధిలోకి వెళ్లాక కాలేజీలో 100 సీట్లకు అనుగుణంగా 430 బెడ్లకే అనుమతి ఇచ్చి ఏజెన్సీకి రూ.35 లక్షలు మాత్రమే చెల్లిస్తోంది. దీంతో కాంట్రాక్టర్ కార్మికులకు నెలనెలా జీతాలు ఇవ్వలేకపోతుండడంతో తరచూగా సమ్మెకు దిగడం.. ఒక నెల వేతనం చెల్లించి విధుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారింది.
అధ్వానంగా అంతర్గత రోడ్లు
జిల్లా జనరల్ ఆస్పత్రి మెడికల్ కళాశాల పరిధిలోకి వెళ్లి రెండేళ్లు కావొస్తున్నా రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా రోడ్లు గుంతలమయమై రోగులు, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. ఇక చిన్నపాటి వర్షం కురిస్తే గుంతల్లో నీరు నిలిచి మరింత సమస్య ఎదురవుతోంది.
కురుస్తున్న పాత భవనం
అరవై ఏళ్ల క్రితం నిర్మించిన ఆస్పత్రి పాతభవనం కొద్దిపాటి వర్షానికి కురుస్తోంది. పాత భవనంలో మినిస్టీరియల్ విభాగాలు, సూపరింటెండెంట్ కార్యాలయం, ల్యాబ్‌లు, ఎయిడ్స్ విభాగాలు ఉన్నాయి. భవనం పాతది కావటంతో స్లాబ్ పెచ్చులు ఊడి పడుతుండడంతో వర్షం మొదలుకాగానే నీరు కారుతోంది. పాత భవనం స్థానంలో నూతన భవన నిర్మాణం ప్రతిపాదనలు ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు.
మౌలిక సదుపాయాలు కరువు
నిత్యం వేలాది మంది వచ్చివెళ్లే ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. కనీస స్థాయిలో మరుగుదొడ్లు లేకపోగా ఉన్నవి అధ్వానంగా తయారయ్యాయి. తరచూ పైప్‌లైన్లు లీకేజీతోమురుగు నీరు బయటకు వస్తోంది. నీరు నిల్వ చేయటానికి పాత సంపులు సరిపోక నీటి కొరత కూడా వేధిస్తోంది. అలాగే అత్యవసర విభాగాల్లో ఏసీలు సరిపడా లేకపోగా.. జనరల్ సర్జరీ, ఆర్ధో పెడిక్ సర్జరీ విభాగాల్లో కావాల్సిన పరికరాలు, ఆల్ట్రా సౌండ్ మిషన్, పిల్లలకు కావాల్సిన టూడీ ఎకో, డాఫ్లర్ మిషన్ పరికరాలను సమకూర్చాల్సి ఉంది.
లోటుపాట్లు, కావాల్సిన సౌకర్యాలపై చర్చ
కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం హెచ్‌డీఎస్ ముందస్తు సమావేశం జరగనుంది. ఆస్పత్రిలో అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలపై సమావేశంలో చర్చించేలా అజెండా రూపొందించాం. కలెక్టర్ చైర్మన్‌గా, డీఎంఈ వైస్ చైర్మన్‌గానే కాక 17మందితో కమిటీ ఉంటుంది. ఈ సమావేశంలో సమస్యలపై చర్చించి,
ప్రతిపాదనలను ఆమోదించే అవకాశముంది.
– ఎం.నరేందర్, మెడికల్ సూపరింటెండెంట్

చర్చించండి.. పరిష్కరించండి

చర్చించండి.. పరిష్కరించండి