
కదిలించిన ‘ఎడారిలో వాన చినుకు’
ప్రారంభమైన నాటికల పోటీలు
ఖమ్మంగాంధీచౌక్: తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు గురువారం రాత్రి ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. నెలనెలా వెన్నెల 8వ వార్షికోత్సవం సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ పోటీలు ఏర్పాటుచేశారు. తొలిరోజు రెండు నాటికలను ప్రదర్శించగా ఏపీలోని కాకినాడకు చెందిన శ్రీసాయి కార్తీక్ క్రియేషన్స్ వారి ‘ఎడారిలో వాన చినుకు’ నాటిక కంట తడి పెట్టించింది. అల్లారుముద్దగా పెంచుకున్న కొడుకు పెళ్లి తర్వాత భార్య మాటలు విని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేయడం, అమెరికా నుంచి వచ్చిన ఇంకో వ్యక్తి వారిని దత్తత తీసుకునేందుకు ముందుకొస్తే కుమారుడు రూ.25 లక్షలకు బేరం పెట్టడం ఇతివృత్తంగా ప్రదర్శించిన ఈ నాటిక అందరినీ కదిలించింది. ఈ నాటికను శారద ప్రసన్న రచించగా, సీహెచ్.మహేష్ దర్శకత్వం వహించారు. ఆతర్వాత హైదరాబాద్ కళాంజలి కళాకారులు ‘కొత్తభూతం’ నాటికను ప్రదర్శించారు. శ్రీకాళహస్తి నాగరాజు రచించిన ఈ కథకు సాదినేని శ్రీజ నాటకీకరణ చేయగా, కె.రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.
అందరి సహకారంతో...
నాటక పోటీలను అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ బాధ్యులు అన్నాబత్తుల పుష్పరాణి, ఖమ్మం కళా పరిషత్ కార్యదర్శి వేల్పుల విజేత, అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, డాక్టర్ నాగబత్తిని రవి, బయ్యన బాబు, మోటమర్రి జగన్మోహన్ రావు, నామ లక్ష్మీనారాయణ, వేముల సదానందం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరి సహకారంతో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా, పోటీలకు వివిధ జిల్లాల నుంచి 180మంది కాకారులు హాజరుకాగా ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి వారికి వసతి, బోజనం, అల్పాహారం సమకూర్చడంపై కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఎడారిలో వానచినుకు నాటికకు జిల్లా ఎన్నారై ఫౌండేషన్ అధ్యక్షులు బాబు బయ్యన పారితోషికం అందించగా, ఎన్నారై ఫౌండేషన్ నుంచి రూ. లక్ష చెక్కును పేద విద్యార్థుల చదవులకు అందించారు.

కదిలించిన ‘ఎడారిలో వాన చినుకు’