
15నాటికి దరఖాస్తుల పరిష్కారం
ఖమ్మం సహకారనగర్: భూభారతి చట్టానికి సంబంధించి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల పరిష్కారం ఈనెల 15 నాటికి పూర్తయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి గురువారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. దరఖాస్తుల స్థితిగతులు, పరిశీలన, పరిష్కారంపై ఆరా తీసిన ఆయన 15 నాటికి పరిష్కరించేలా సూచనలు చేశారు. మొత్తం 75 వేల దరఖాస్తులు రాగా, సాదా బైనామావి మినహాయించి మిగతా దరఖాస్తులు పరిశీలిస్తూ తిరస్కరిస్తే కారణాలు తెలపాలని చెప్పారు. ప్రతీ మండలంలో పది శాతం దరఖాస్తులను తనిఖీ చేస్తామని తెలిపారు. కాగా, భూభారతి దరఖాస్తులు పరిష్కారమయ్యే వరకు రెవెన్యూ ఉద్యోగులు సెలవు తీసుకోవద్దని సూచించారు. తొలుత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపికపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఆర్డీఓ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
●జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా మౌలిక వసతుల కల్పనపై అధికారులు శ్రద్ధ వహించాలని కేంద్ర జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ సూచించారు. తెలంగాణ, ఝార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కలెక్టర్లతో గురువారం వీసీ ద్వారా మాట్లాడిన ఆయన జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ పథకాల అమలు, ఎప్పటికప్పుడు పనులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమావేశమై రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, అంగన్‌వాడీల్లో తాగునీటికి పనులపై ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. మిషన్ భగీరథ ఎస్‌ఈ శేఖర్‌రెడ్డి, ఈఈలు పుష్పలత, వాణిశ్రీ పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి