
అష్టైశ్వర్యాలు ప్రసాదించు తల్లీ..
నేడు వరాల దేవత వరలక్ష్మీ వ్రతం
ఖమ్మంగాంధీచౌక్: శ్రావణ మాసం అంటే వ్రతాలు, పూజలు, పండుగలకు ప్రత్యేకం. ఈ మాసంలో మహిళలు ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. అష్టైశ్వర్యాలను ప్రసాదించే వరలక్ష్మీ దేవి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడం ఆనవాయితీ. మహిళలు దీర్ఘ సుమంగళిగా ఉండాలని, యువతులు మంచి భర్త లభించాలని, పెళ్లయిన వారు మంచి సంతానం కోసం వ్రతం చేయడమే కాక దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలతో సమానమని నమ్ముతారు.
వ్రతానికి సన్నద్దం..
వరాలను ఇచ్చే వరలక్ష్మి అమ్మవారి వ్రతానికి మహిళలు సిద్ధమయ్యారు. ఈమేరకు పూలు, మామిడాకులు, పండ్లు, అమ్మవారి చిత్రపటాలు ఇతర సామగ్రి కొనుగోళ్లతో నిమగ్నమయ్యారు. దీంతో గురువారం సాయంత్రం ప్రధాన వీధుల్లో రద్దీ నెలకొనగా పూలు, పండ్లకే కాక కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది. బంతి, చామంతి పూలు కిలో ధర రూ.450 దాటగా, కొబ్బరి కాయలను రూ.35కు పైగా అమ్మారు. కాగా, పలువురు మహిళలు సామూహికంగా వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఇందుకోసం ఆలయ కమిటీల నేతృత్వాన ఏర్పాట్లు చేశారు. ఇంకొందరు ఇళ్లలోనే వ్రతం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.