
చేనేత రంగం బలోపేతానికి కృషి
ఖమ్మంగాంధీచౌక్: చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు కార్మికులకు అండగా నిలిచేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. ముందు తరాలు కూడా చేనేత దుస్తులపై ఆసక్తి పెంచుకునేలా ప్రస్తుత తరం వారు చేనేత వస్త్రాలనే ధరించాలని సూచించారు. అలాగే, కార్మికులు తెలంగాణ నేతన్న పొదుపు పథకం, భద్రతా పథకం, భరోసా పథకం, రుణమాఫీ పథకాలను వినియోగించుకుంటూ వృత్తిలోఎదగాలని తెలిపారు. అనంతరం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి.. కార్మికులకు పథకాల చెక్కులు అందజేశారు. చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం..విజయలక్ష్మి, కార్యాలయ ఉద్యోగుగులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.