
బొగ్గు లోడింగ్‌లో ఇష్టారాజ్యం
● టెండర్ పొడిగిస్తూ ఆర్‌సీహెచ్‌పీకి తరలింపు ● కోల్‌ఏజెంట్ల తీరుతో లారీల యజమానులకు నష్టం ● ఆందోళన చేసినప్పుడే లోడింగ్ పెంపు
సత్తుపల్లి: సింగరేణి వ్యాప్తంగా సత్తుపల్లి మండలంలోని ఓసీల్లో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవుతోంది. అయితే, దీంతో ఇక్కడి బొగ్గు కోసం వివిధ ప్రాంతాల పరిశ్రమల నుంచి ఆర్డర్లు వస్తుండగా.. రవాణాలో స్థానిక లారీల యజమానులకు మాత్రం చుక్కెదురవుతోంది. ఇదే సమయాన కొత్తగూడెంలోని రుద్రంపూర్ కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్(ఆర్‌సీహెచ్‌పీ)కు మాత్రం నిరంతరాయంగా రవాణా జరుగుతోంది. ఈక్రమాన తమకు అన్యాయం జరుగుతోందని లారీల యజమానులు మూడురోజులు అడ్డుకోవడంతో అధికార యంత్రాంగం మొత్తం కదిలొచ్చింది. కానీ న్యాయం చేయకపోగా ఆందోళనలు విరమించకపోతే ఉపేక్షించబోమని, కేసులు పెట్టేందుకై నా వెనుకాడమని హెచ్చరిస్తుండడం గమనార్హం. అయితే, తమను అధికారులు బెదిరించడం వెనుక బలమైన శక్తులు ఉన్నాయని లారీల యజమానులు వాపోతున్నారు.
తాత్కాలిక టెండర్లతో...
సత్తుపల్లి నుంచి కొత్తగూడెంలోని ఆర్‌సీహెచ్‌పీ టిప్పర్లలో బొగ్గు రవాణా చేస్తుండగా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)ను ఆశ్రయించారు. దీంతో రవాణాపై ఆంక్షలు విధించినా... సింగరేణి యాజమాన్యం తాత్కాలిక టెండర్ ఖరారు చేసి పొడిగిస్తోంది. రోజుకు 60 – 70 టిప్పర్లతో నాలుగు నుంచి ఐదు ట్రిప్పుల బొగ్గు రవాణా చేస్తుండగా.. స్థానిక లారీలకు లోడింగ్ దక్కక యజమానులు ఫైనాన్స్ కిస్తీ కట్టలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
1,500 టన్నుల లోడింగ్
ఇటీవల సత్తుపల్లి లారీల యజమానులు చేపట్టిన ఆందోళనతో సింగరేణి సీఎండీ బలరాంనాయక్ స్పందించారు. ఇందులో భాగంగా స్థానిక లారీలకు రోజుకు 1,500 టన్నుల బొగ్గు లోడింగ్ ఇవ్వాలని సూచించారని కిష్టారం ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ నర్సింహారావు తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి సైతం ఈ అంశంపై అధికారులతో చర్చించారని, అవసరమైతే మరింత లోడ్ పెంచేందుకు ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు.
కోల్ ఏజెంట్లదే పెత్తనం
బొగ్గు లోడింగ్ ఇవ్వాలంటూ లారీల యజమానులు ఆందోళన చేయడం.. అప్పుడే అధికారులు ఎంతో కొంత లోడ్ పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇదేసమయాన కోల్ ట్రాన్స్‌పోర్టర్ల నుంచి పర్మిట్లు తెచ్చుకున్న ఏజెంట్లు బొగ్గు లోడింగ్ బయట లారీలకే ఇస్తూ స్థానికులకు మొండిచేయి చూపుతున్నారు. అంతేకాక లోకల్ లారీలకు లోడింగ్ ఇవ్వాలంటే టన్నుకు రూ.100 నుంచి రూ.150, కిరాయిలో నాలుగు శాతం కమీషన్, రిసీవ్డ్ మామూలు కింద రూ.400 వసూలుతో పాటు అన్‌లోడింగ్ లేని చోట టన్నుకు రూ.60 చొప్పున మినహాయిస్తే లారీకి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు దండుకుంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఇకపోతే బయట లారీల నుంచి రెండింతలు అదనంగా వసూళ్లు చేస్తున్నారని సమాచారం. ఇదేమిటని లారీల యజమానులు ఏజెంట్లను ప్రశ్నిస్తే లోడింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సత్తుపల్లిలో ఆరుగురు ఏజెంట్లు మొత్తం వ్యవహారాన్ని శాసిస్తున్నారని చెబుతున్నారు. మందమర్రి, తదితర ప్రాంతాల్లో లారీ యూనియన్ బాధ్యులే కోల్ ట్రాన్స్‌పోర్టర్లను సంప్రదించి లోడింగ్ ఇస్తుండగా.. ఇక్కడ అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉండడం గమనార్హం.