● గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో వార్డెన్ల ఇష్టారాజ్యం ● అధికారుల తనిఖీలు కూడా నామమాత్రమే.. ● ప్రత్యేక అధికారుల పరిశీలనలో వెలుగుచూసిన లోపాలు ● కల్లూరు ఘటనలో వార్డెన్ సస్పెన్షన్
ఖమ్మంమయూరిసెటర్: జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడి సరైన భోజనం, సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులుపడుతున్నారని తల్లిదండ్రులు ఆరో పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా.. ఇటీవల కల్లూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం గమనార్హం. అయితే, కల్లూరు ఘటనకు వార్డెన్ విజయనిర్మల పర్యవేక్షణ లోపమే కారణమని గుర్తించిన ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. అలాగే, ఇన్‌చార్జ్ వార్డెన్‌గా హెచ్‌ఎం శ్రీనివాసరావును నియమించగా, ఏటీడీఓ భా రతిదేవి బుధవారం పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
మధ్యాహ్నం చికెన్.. అదే సాయంత్రం?
కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈనెల 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం విద్యార్థినులకు చికెన్ వండి పెట్టినట్లు తెలిసింది. అయితే ఇదే చికెన్‌ను కొందరు విద్యార్థులు సాయంత్రం కూడా తిన్నారని సమాచారం. వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఏ పూట వండింది ఆ పూటే వడ్డించాల్సి ఉండగా.. మధ్యాహ్నం వంటే సాయంత్రం కూడా వడ్డించడం, శుచి, శుభ్రత లేని కారణంగా ఫుడ్ పాయిజనింగ్ దారి తీసినట్లు తెలిసింది. అంతేకాక విద్యార్థినులు భోజనం చేసే సమయాన పర్యవేక్షించాల్సిన వార్డెన్ ఆ రోజు వసతిగృహంలో లేకుండా ఖమ్మంలో ఓ అధికారి రిటైర్‌మెంట్ వేడుకలకు హాజరైనట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా వార్డెన్లు ఆదివారం ఆ ఫంక్షన్‌లోనే గడిపారని తెలిసింది. ఫలితంగా విద్యార్థుల ఆహారం విషయంలో పర్యవేక్షణ లేక ఇబ్బంది పడినట్లు సమాచారం.
జిల్లా కేంద్రంలోనే వార్డెన్లు
ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల వార్డెన్లు చాలా మంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడంలో విఫలమవుతుండగా, నాణ్యత లేని, అపరిశుభ్రమైన ఆహారం వడ్డించడం, తాగునీటి సరఫరా సరిగా లేకపోవడం, పరిశుభ్రత లేని మరుగుదొడ్లు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ కారణాలతో విద్యార్థులు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల గిరిజన శాఖలో అవసరం ఉన్నా, లేకున్నా ప్రొటోకాల్ పేరు చెప్పి వసతిగృహం విధులకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గ్రామీణ, మండల కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సిన వార్డెన్లు జిల్లా కేంద్రంలోనే కాలం వెళ్లదీస్తున్నారని సమాచారం.
తూతూ మంత్రంగా తనిఖీలు
విద్యార్థుల సంక్షేమం, ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు కూడా బాధ్యతలపై నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలున్నాయి. కేవలం మొక్కుబడిగా తనిఖీలుచేస్తూ, లోపాలు సరిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. ఇటీవల కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదేశాలతో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఎంఈఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ అధికా రులు చేపట్టిన తనిఖీల్లో అనేక లోపాలు బయటపడడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. వంటశాలలు అపరిశుభ్రంగా ఉండడం, కూరగాయలు, సరుకుల్లో నాణ్యత లోపించడం తదితర లోపాలను గుర్తించినట్లు సమాచారం. అయితే, వార్డెన్లు మాత్రం తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రత్యేక అధికారుల పరిశీలనపై విమర్శలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా, ప్రత్యేక అధికారులు గుర్తించిన లోపాలపై జిల్లా అధికారులు వార్డెన్లను వివరణ కోరినట్లు తెలిసింది.