
అన్నీ అరకొర వసతులే...
కల్లూరు: కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అరకొర వసతులతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మూడు నుంచి పదో తరగతి వరకు చదివే 93 మంది విద్యార్థినులు ఉండగా.. బాత్ రూమ్‌లు, టాయ్‌లెట్‌లు సక్రమంగా లేవు. చాలా బాత్‌రూమ్‌లకు డోర్లు కూడా లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇక కుక్ పోస్టు ఖాళీగా ఉండడంతో సహాయకులే వంట వండుతుండగా సమస్యలు ఎదురవుతున్నాయి. గత ఆదివారం మధ్యాహ్నం వండిన చికెనే సాయంత్రం వడ్డించగా.. సోమవారం ఉదయం సైతం ఉడికీ, ఉడకనీ కిచిడీ పెట్టడంతో విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించడంతో అంతా కోలుకున్నా భయంతో తల్లిదండ్రులు పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ ఘటనలో వార్డెన్ విజయనిర్మల నిర్లక్ష్యం ఉందని తేలడంతో సస్పెండ్ చేశారు. అయితే, సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా పూర్తి కాలపు కుక్‌ను నియమించడంతో పాటు బాత్‌రూమ్‌లు, టాయ్‌లెట్లకు తలుపులు అమర్చాలని, డార్‌మెట్రీల్లో దోమలు రాకుండా మెష్ ఏర్పాటు చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు.
డీఎంహెచ్‌ఓ పరిశీలన
కల్లూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం డీఎంహెచ్‌ఓ కళావతిబాయితో పాటు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సీతారామ్, కల్లూరు వైద్యాధికారి నవ్యకాంత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటశాల, వంట తయారీకి ఉపయోగించే సామగ్రిని పరిశీలించి సిబ్బదికి సూచనలు చేశారు. అలాగే, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.