
నిబద్ధత గల నాయకుడిని కోల్పోయాం..
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు బొల్లోజు అయోధ్య మరణంతో కమ్యూనిస్టు పార్టీ నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయిందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భద్రాద్రి జిల్లా సీపీఐ నాయకుడు బొల్లోజు అయోధ్య మృతదేహాన్ని ఖమ్మంలోని సీపీఐ కార్యాలయానికి తీసుకొచ్చా రు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, పాకాలపాటి వెంకటేశ్వరరావు, జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మౌలానా, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కార్యదర్శులు దండి సురేష్, సాబీర్‌పాషా తదితరులు అయోధ్య మృతదేహంపై పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ చిరుప్రాయంలోనే ఎర్ర జెండా పట్టిన అయోధ్య తుదిశ్వాస వరకు అదే జెండా నీడలో పని చేశారని, ఆటుపొట్లను తట్టుకుని పేదలకు భూమి అందేలా చూశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్ముల జితేందర్‌రెడ్డి, పాకాలపాటి లలితరాజేశ్వరి, యర్రా బాబు, మిరియాల రంగయ్య, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొనగా.. అయోధ్య మరణంపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.
అయోధ్యకు సీపీఐ నేతల నివాళి