
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) ఆధ్వర్యాన మంగళవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో యూఎస్‌పీసీ బాధ్యులు, టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇస్తూనే బదిలీలు చేపట్టాలని, పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలన్నారు. అలాగే, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాక ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేసి, బీఈడీ అర్హత కలిగిన వారికి కూడా ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంగా పదోన్నతి ఇవ్వాలని, 2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులకు వేతనం, పెండింగ్ డీఏలను విడుదలకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. యూఎస్‌పీసీ నాయకులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, టి.వెంగళరావు, మన్సూర్, పి.నాగిరెడ్డి, పద్మ, షమి, వెంకన్న, రాంబాబు, రాందాస్, నాగేశ్వరరావు, సురేష్, ప్రశాంతి, వలీ, ఉద్దండ్, మనోహర్ రాజు, రాజశేఖర్ పాల్గొనగా... సీపీఎం, మాస్‌లైన్ నాయకులు నున్నా నాగేశ్వరరావు, జి.వెంకటేశ్వరరావు, అశోక్, వెంకటేష్ తదితరులు సంఘీభావం తెలిపారు.