
పాలనా కష్టాలు
శిథిల భవనాలు..
439 సొంతం.. 76 శిథిలం
జిల్లాలో మొత్తం 571 గ్రామపంచాయతీలు ఉండగా, 439 జీపీలు సొంత భవనాల్లో నిర్వహిస్తున్నారు. మిగతా 132 పంచాయతీలు అద్దె భవనాల్లో ఉన్నాయి. అయితే, సొంత భవనాల్లో 76 పూర్తిగా శిథిలావస్థకు చేరాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని భవనాలు కూడా దెబ్బతినడంతో శ్లాబ్‌లు పెచ్చులూడి.. చువ్వలు బయటకు తేలి కనిపిస్తున్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా గోడలన్నీ నాని కురుస్తుండడంతో రికార్డులు తడిసిపోవడమే కాక ఎప్పుడేం జరుగుతుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అలాగే, కొన్ని భవనాల్లో విద్యుత్ వైరింగ్ అస్తవ్యస్తంగా మారి వర్షం వచ్చిన సమయాన ప్రమాదాలకు ఆస్కారముండడంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ మండలాల్లో అధ్వానం..
జిల్లాలోని ముదిగొండ మండలంలో 25 గ్రామపంచాయతీలు ఉండగా.. పది భవనాలు శిథిలావస్థకు చేరాయి. కూసుమంచి మండలంలో 41 గ్రామపంచాయతీలకు గాను ఏడింటి భవనాలు దెబ్బతిన్నాయి. బోనకల్ మండలంలో సీతానగరం కొత్త పంచాయతీ ఏర్పడగా స్థల సమస్యతో భవన నిర్మాణం ముందుకు సాగడంలేదు. అలాగే, పెద్ద బీరవల్లి, జానకీపురం, బ్రాహ్మణపల్లి, రాపల్లి, రాయన్నపేట భవనాలు ప్రమాదపుటంచున ఉన్నాయి. ఏన్కూరు మండలంలోని 25 జీపీల్లో 14 సొంతభవనాలు ఉండగా.. కొత్తగా ఏర్పడిన 11 పంచాయతీలకు భవనాలు మంజూరయ్యాయి.
కొనసాగుతున్న నిర్మాణాలు..
జిల్లాలో 164 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే, వీటిలా చాలా నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉంది. ఇందులో 98 పంచాయతీలకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు, 66 పంచాయతీలకు ఎస్టీ కాంపోనెంట్ నిధులు కేటాయించారు. వీటిలో కేవలం 47 భవనాల నిర్మాణమే పూర్తయింది.
ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని జీపీ భవనాలు
కొత్త గ్రామపంచాయతీల్లో
మరిన్ని ఇక్కట్లు
నిధులు మంజూరైనా పూర్తయినవి కొన్నే..
గ్రామ స్వరాజ్యానికి పట్టుగొమ్మలుగా నిలిచే గ్రామపంచాయతీల్లో కొన్నింటి భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, వివిధ పనులపై వచ్చే ప్రజలు ఎప్పుడు కూలుతాయోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొన్ని గ్రామపంచాయతీలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. అంతేకాక కొత్తగా ఏర్పడిన పంచాయతీ భవనాలకు నిధులు మంజూరైనా నిర్మాణ ప్రక్రియ ఏళ్లుగా కొనసాగుతోంది.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
40 ఏళ్ల క్రితం నిర్మాణం
ఏన్కూరు మండలంలోని రాజలింగాల పంచాయతీ భవనాన్ని 40ఏళ్ల క్రితం నిర్మించారు. ఇది ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో స్లాబ్ పెచ్చులూడి పడుతూ వర్షం వస్తే కురుస్తోంది. దీని స్థానంలో కొత్త భవనానికి నిధులు కేటాయించాలని ఉద్యోగులు, గ్రామస్తులు కోరుతున్నారు.
జిల్లాలోని గ్రామపంచాయతీ భవనాల వివరాలు...
మొత్తం గ్రామపంచాయతీలు 571
సొంత భవనాల్లో ఉన్న జీపీలు 439
అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నవి 132
శిథిలావస్థకు చేరిన భవనాలు 76
కొత్త భవనాలు మంజూరైనవి 164
నిర్మాణాలు పూర్తయినవి 47
పనులు కొనసాగుతున్నవి 117
అమ్మో.. ఆ భవనంలోనా?
బోనకల్ మండలం జానకీపురం గ్రామపంచాయతీ భవనాన్ని 1991లో నాటి కేంద్ర మంత్రి పీ.వీ.రంగయ్య నాయుడు ప్రారంభించారు. భవన నిర్మాణ సమయంలో నాణ్యత పాటించలేదనే ఆరోపణలు ఉండగా కొన్నాళ్లకే శిథిలావస్థకు చేరింది. స్లాబ్ పైభాగంలో పెచ్చులు ఊడి చువ్వలు తేలగా, వర్షం వస్తే కురుస్తోంది. విధులు నిర్వర్తించేందుకు ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు.. గ్రామసభలను ఆరు బయట టెంట్ వేసి నిర్వహిస్తున్నారు. పలుమార్లు విన్నవించగా ఇటీవల నూతన భవనం మంజూరైంది.

పాలనా కష్టాలు

పాలనా కష్టాలు