
సుడాపై పట్టింపేది?
2023 డిసెంబర్‌లో రద్దయిన పాలకవర్గం
● ఆతర్వాత కార్యాలయ భవనం సైతం ఖాళీ ● మాస్టర్ ప్లాన్‌లోనూ కానరాని కదలిక ● పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా వెంచర్ల ఏర్పాటు, నిర్మాణాలు
●కార్యాలయం ఖాళీ
పాలకవర్గం ఏర్పడిన తర్వాత సుడా కార్యాలయాన్ని రోటరీక్లబ్ పక్కన డీసీసీబీ బ్యాంక్ భవనంలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారాక పాలకవర్గాన్ని రద్దు చేయడంతో ఆ భవనం నుంచి ఖాళీ చేయించారు. దీంతో కార్యాలయ సామగ్రిని కేఎంసీకి తరలించి టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ఓ గదిలో పెట్టించారు. ఫలితంగా పాలకవర్గం మాటేమో కానీ కనీసం కార్యాలయం కూడా లేక సుడా పాలన ఆగమ్యగోచరంగా మారింది.
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని పట్టణ ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న గ్రామాల అభివృద్ధికి గత ప్రభుత్వం స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా)ను ఏర్పాటు చేసింది. ఆపై పాలకవర్గాన్ని నియమించగా.. వెంచర్ల ఏర్పాటు, నిర్మాణాలకు అనుమతులు మంజూరు తదితర పనులు కొనసాగాయి. అయితే, ప్రభుత్వం మారాక 2023 డిసెంబర్‌లో పాలకవర్గాన్ని రద్దు చేసినా కొత్త పాలకవర్గాన్ని నియమించకపోవడం.. కనీసం కార్యాలయం కూడా లేకపోవడంతో పర్యవేక్షణ లోపించి ఇష్టారాజ్యంగా వెంచర్ల ఏర్పాటు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇదే అదనుగా కొందరు ఉద్యోగులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
2017లో ఏర్పాటు
స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ 2017 అక్టోబర్ 24న ఏర్పాటైంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు వైరా మున్సిపాలిటీ, కూసుమంచి, ఖమ్మంరూరల్, ముదిగొండ, చింతకాని, కొణిజర్ల, రఘునాథపాలెం మండలాల్లోని 44 గ్రామపంచాయతీలతో 573 చదరపు కి.మీ. వైశా ల్యంతో సుడాను ఏర్పాటు చేశారు. ఈ పరిధిలో అభివృద్ధి పనులే కాక నిర్మాణాలు, వెంచర్ల ఏర్పాటును పర్యవేక్షించాల్సి ఉంటుంది.
పరిధి మరింత విస్తరణ
‘సుడా’ విస్తరణతో అభివృద్ధి పనుల పర్యవేక్షణ సులువవుతుందని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ విస్తరణ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోగా... జిల్లాలో అభివృద్ధికి వీలుగా ఉన్న అన్ని ప్రాంతాలను సుడా పరిధిలోకి తీసుకొచ్చారు. కామేపల్లి, ఏన్కూరు, కారేపల్లి మినహా అన్ని మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలను చేర్చారు. తద్వారా 17 మండలాల పరిధిలోని 279 గ్రామపంచాయతీలను, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలను సుడాలో విలీనం చేస్తూ 2024 అక్టోబర్‌లో జీఓ జారీ చేశారు.
పాలకవర్గం రద్దు
తొలిసారి ‘సుడా’కు 2020 జూన్‌లో పాలకవర్గాన్ని నియమించగా, 2023 డిసెంబర్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక అదే నెలలో 10వ తేదీన పాలకవర్గాన్ని రద్దు చేసింది. చైర్మన్‌తో పాటు 14 మంది డైరెక్టర్లు పదవులు కోల్పోగా, ఇప్పటి వరకు కొత్త పాలకవర్గాన్ని నియమించలేదు. దీంతో ‘సుడా’ కార్యకలాపాలన్నింటినీ వైస్ చైర్మన్‌గా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. కాగా, పూర్తి స్థాయిలో ఉద్యోగులను నియమించని కారణంగా కేఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులే సుడా పనులనూ చక్కబెడుతున్నారు.
అభివృద్ధికి ఆటంకం
సుడా ఏర్పడ్డాక ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుడా పరిధిలో మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధమైనా రకరకాల కారణాలతో గత ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఫలితంగా పాత ప్రణాళికలతోనే వెంచర్ల ఏర్పాటు, అభివృద్ధి పనులు, భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక సుడా విస్తరించిన తర్వాత కూడా మాస్టర్ ప్లాన్ ఆమోదానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇష్టారీతిన జరుగుతున్న నిర్మాణాలు భవిష్యత్ అభివృద్ధికి ఆటంకంగా మారే అవకాశముందన్న చర్చ జరుగుతోంది.