
పకడ్బందీగా ఆర్‌టీఐ చట్టం అమలు
ఖమ్మంసహకారనగర్: గత రెండేళ్లుగా ఆర్‌టీఐ కమిషనర్లు లేని కారణంగా 15 వేలకు పైగా కేసులు పేరుకుపోయాయని, వీటిని త్వరగా పరిష్కరిస్తూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయడంపై అధికారులు దృష్టి సారించాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ పీ.వీ.శ్రీనివాసరావు సూచించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మరో కమిషనర్ భూపాల్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలనే లక్ష్యంతో ఉన్నందున అధికారులు సహకరించాలని తెలి పారు. దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యమైతే ప్రజల్లో అనుమానాలు రానున్నందున.. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సమాచారం ఇవ్వాలని సూచించారు. మరో కమిషనర్ భూపాల్ మాట్లాడుతూ ఆర్‌టీసీ చట్టంపై అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అనంతరం పెండింగ్ కేసులపై అప్పీళ్లను స్వీకరించారు. ఆతర్వాత కలెక్టర్ అనుదీప్ మాట్లాడగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్‌ఓ పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రిటైనింగ్ వాల్ పనులపై కలెక్టర్ సమీక్ష
ఖమ్మం మున్నేరు అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి భూసేకరణలో వేగం పెంచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మున్నేటి రిటైనింగ్ వాల్ నిర్మాణ పురోగతి, అవసరమైన భూసేకరణ, భూనిర్వాసితులకు ఇచ్చే లే ఔట్ పనులపై శుక్రవారం అధికారులతో సమీక్షించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరించడమే కాక, నిర్వాసితులకు స్థలాలు కేటాయించనున్న లేఔట్ అభివృద్ధిపై సూచనలు చేశారు. రైతుల పొలాలకు ప్రత్యామ్నాయంగా ప్లాట్లును కేటాయిస్తున్నందున లేఔట్‌లో అంతర్గత రోడ్లు, వీధి లైట్లు, విద్యుత్ సంబంధిత పనులు చేపట్టాలని తెలిపారు. పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, నీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ రమేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్లు శ్రీనివాసరావు, భూపాల్