
ప్రకాశ్‌నగర్ చెక్‌డ్యాం ఎత్తు తగ్గింపు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ప్రకాశ్‌నగర్‌లో మున్నేటిపై నిర్మించిన చెక్‌డ్యాం ఎత్తు తగ్గింపు పనులు మొదలయ్యాయి. ఈ చెక్‌డ్యాంను రూ.7కోట్లతో నిర్మించగా 2019లో మొదలైన పనులు 2022లో పూర్తయ్యాయి. అయితే, గత ఏడాది మున్నేటి వరద పోటెత్తగా ఈ చెక్‌డ్యాం వద్ద ప్రవాహం అడ్డుపడడంతోనే పరీవాహక ప్రాంతాలకు నష్టం జరిగిందనే అంచనాకు వచ్చారు. ఈమేరకు ఎత్తు తగ్గింపుపై కలెక్టర్ నివేదిక సమర్పించగా ఆయన ఆదేశాలతో శుక్రవారం పనులు మొదలుపెట్టారు. గ్రానైట్ రాళ్లు కట్ చేసేందుకు ఉపయోగించే యంత్రాల సాయంతో దాదాపు 200 మీటర్ల పొడవుతో ఉన్న చెక్‌డ్యాంను కొలత ప్రకారం ఎత్తు తగ్గిస్తున్నారు. కాగా, భూమి లోపలి నుంచి 11 అడుగుల ఎత్తుతో, ఉపరితలంపై ఏడు అడుగులుగా చెక్ డ్యాం ఉంటుంది. ప్రస్తుతం 5.5 అడుగుల మేర తొలగిస్తుండడంతో 1.5 అడుగులు మాత్రమే మిగిలే అవకాశముంది. ఈ పనులను ఖమ్మం రూరల్ తహసీల్దార్ పి.రాంప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేక యంత్రాలతో మొదలైన పనులు
భిన్నాభిప్రాయాలు
రూ.7కోట్లతో ప్రకాశ్‌నగర్ వద్ద మున్నేటిపై చెక్ డ్యాం నిర్మించగా అన్ని కాలాల్లో ఇక్కడ నీరు నిల్వ ఉంటోంది. నగరంలో భూగర్భ జలాలు పెరగడానికి ఇక్కడి నిల్వలే కారణమని చెబుతున్నారు. కానీ నిర్మించిన మూడేళ్లలోనే చెక్ డ్యాం ఎత్తు తగ్గిస్తుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది కనీవిని ఎరుగని రీతిలో వరద వచ్చినా ఈ ఏడాది కూడా పరిశీలించాక.. ప్రమాదముందని నిర్ధారణ అయ్యాక తొలగిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాంటిదేమీ లేకుండా చెక్‌డ్యాం తొలగిస్తుండడంతో నగరంలో భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందని పలువురు చెబుతున్నారు. కాగా, ప్రజల భద్రత దృష్ట్యా చెక్ డ్యాం ఎత్తు తగ్గింపునకు కలెక్టర్ అనుమతి జారీ చేయగా... జలవనరుల శాఖ ఉన్నతాఽధికారుల అనుమతి కోసం లేఖ రాసినా బదులు రాలేదని సమాచారం.