
పారదర్శకంగా లేఔట్ అనుమతులు
● ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిరాకరించాలి ● జిల్లా లేఔట్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మంమయూరిసెంటర్: నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో లేఔట్ అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన లేఔట్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అనుదీప్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేఔట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర అనుంబంధ శాఖల అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. ప్రతిపాదిత ప్రాంతాలు నీటి వనరుల సమీపాన ఉన్నాయా అని గూగుల్ ఎర్త్ ద్వారా పరిశీలించిన కలెక్టర్ మాట్లాడారు. లేఔట్ అనుమతుల సమయాన క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉంటే దరఖాస్తులు తిరస్కరించాలని సూచించారు. ఇక అనుమతి వచ్చిన వాటి విషయంలో మొక్కల పెంపకానికి స్థలం కేటాయించేలా చూస్తూ స్ట్రీట్ లైట్లు, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, ఫైర్ సేఫ్టీ చర్యలపై పర్యవేక్షించాలని తెలిపారు. లేఔట్లకు అనుమతులు ఇచ్చాక విద్యుత్ స్తంభాల కేటాయింపునకు ఎన్పీడీసీఎల్ అధికారులతో చర్చించి వారంలోగా చెల్లించకపోతే డ్రాఫ్ట్ అనుమతి ఉపసంహరించాలని కలెక్టర్ చెప్పారు. కాగా, జిల్లాలో ఇక నుంచి ప్రతీ 15 రోజులకోసారి లేఔట్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్‌డీసీ ఎం.రాజేశ్వరి, సుడా సీపీఓ రాజ్‌కుమార్, పీఆర్ ఈఈ మహేష్, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ.శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్లు సైదులు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు
కూసుమంచి: సీజనల్ వ్యాప్తి నేపథ్యాన వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కూసుమంచిలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంతో పాటు హోమియో, ఆయుర్వేద ఆస్పత్రులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రికార్డులు, ఉద్యోగుల హాజరును పరిశీలించాక మందుల లభ్యతపై ఆరాతీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, సాధారణ ప్రసవాలు పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. తహసీల్దార్ రవికుమార్, వైద్యాధికారులు సాయికుమార్, లక్ష్మీలోహిత, ఉద్యోగులు పాల్గొన్నారు.