
మీ కలలకు రెక్కలమవుతాం..
కూసుమంచి: ‘విద్యార్థులు గొప్ప లక్ష్యాలను ఎంచుకుని చదువుతూ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి.. అందుకు కావాల్సిన అన్ని వసతులు మేం సమకూరుస్తాం.. పిల్లల అభివృద్ధి బాధ్యతను అన్ని విధాలుగా మేమే చూసుకుంటాం..’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కూసుమంచిలో రూ.5.50 కోట్ల నిధులతో నిర్మించే ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పీఎస్‌ఆర్ ట్రస్ట్ ద్వారా 76 సైకిళ్లను పంపిణీ చేశాక మంత్రి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాసేపు సైకిళ్లు తొక్కారు. ఆపై 75 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశాక మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే ఏడాదిన్నర కాలంలో రూ.470 కోట్లు విద్యాభివృద్ధికి వెచ్చించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. అలాగే, దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా స్కూళ్లు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటుచేస్తూ, వసతిగృహాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ చార్జీలను రెట్టింపు చేశామని మంత్రి గుర్తు చేశారు. ఇక పాలేరు నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల, యంగ్ ఇండియా సమీకృత గురుకులం, ఐటీఐ భవనాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. పేద విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ పరంగానే కాక పీఎస్‌ఆర్ ట్రస్ట్ ద్వారా చేయూతనిస్తామని మంత్రి వెల్లడించారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ చదువుకు మించిన ఆస్తి ఉండదని.. తాను కలెక్టర్ కావడానికి చదువే కారణమని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రవిబాబు, ఆర్‌డీఓ నర్సింహారావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ రాంచందర్‌రావు, ఎంఈఓ రాయల శేషగిరి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరభద్రంతో పాటు నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, స్వర్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.
మేం వచ్చాకే విద్యాభివృద్ధికి పెద్దపీట
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి