ఇప్పుడైతేనే పని సులువు
● రోడ్ల మరమ్మతులపై దృష్టి సారిస్తే మేలు ● జిల్లాలో గ్రామీణ లింక్‌రోడ్ల పనులపై అనిశ్చితి ● బిల్లుల పెండింగ్‌తో పనులకు కాంట్రాక్టర్ల నిర్లిప్తత
ఖమ్మంఅర్బన్: వర్షాకాలం సమీపిస్తోంది. వర్షాలు జోరందుకుంటే రహదారుల మరమ్మతు పనులు చేపట్టడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నెలారంభం నుంచే మరమ్మతులు చేయించాల్సి ఉన్నా అధికారుల వైపు నుంచి చొరవ కానరవడం లేదు. జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల గ్రామీణ లింక్ రోడ్లుగా ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రహదారులపై గుంతలు తేలగా.. చెట్టుకొమ్మలు రహదారిపైకి పెరగడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు ప్రమాదకరంగా మారాయి. వీటి స్థానంలో కొత్త రోడ్లు వేయకున్నా, ఉన్న రోడ్లనైనా మరమ్మతు చేయాలని కోరుతున్నారు.
ప్రతిపాదనలైతే సిద్ధం
ప్రతీ ఏడాది వర్షాకాలానికి ముందు రహదారులపై గుంతలు పూడ్చడం, రోడ్లకిరువైపులా మట్టి చదును చేయడం, చెట్ల కొమ్మలు తొలగించడం వంటి పనులను వార్షిక నిర్వహణలో భాగంగా చేపట్టాల్సి ఉంటుంది. కానీ రెండేళ్లుగా ఆర్‌అండ్‌బీలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా, వారు ఈసారి పనులపై ఆసక్తి చూపడం లేదని సమాచారం. అయినప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు మాత్రం వార్షిక నిర్వహణ పనుల కోసం టెండర్లకు అంచనాలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో సుమారు 1,200 కి.మీ. మేర రహదారులు ఉండగా, కిలోమీటర్‌కు సగటున రూ.20లక్షల చొప్పున రూ.20 కోట్లతో అంచనాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. కానీ గతంలో పని చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ ఏడాది పనులపై స్పష్టత రావడం లేదు.
పీఆర్ రోడ్ల పరిస్థితీ అదే
వర్షాకాలానికి ముందు రహదారి పనులు పూర్తిచేస్తే బాగుండని వాహనదారులు భావిస్తున్నారు. జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలోని రహదారులే కాక పంచాయతీ రాజ్ రహదారులు సైతం దెబ్బతిన్నాయి. రహదారి పై కనిపించేది చిన్న గుంతలే అయినా అవి ప్రమాదా లకు కారణమవుతున్నాయి. దెబ్బతిన్న రోడ్లకు తోడు రహదారులపైకి చొచ్చుకొచ్చిన కంపచెట్లు, రోడ్డు అంచుల వెంట మట్టి దిగపడడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యాన త్వరగా స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
తుపాన్‌తో దెబ్బతిన్నవి..
గత ఏడాది తుపాన్ కారణంగా అనేక చోట్ల రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు అవసరమైన నిధులతో అంచనాలు పంపినా విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. మళ్లీ వర్షాకాలం వస్తున్నందున మరమ్మతులు చేయకపోతే వరదలతో ఉన్న కొద్దిపాటి రోడ్లు కూడా దెబ్బతింటే అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదముంది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు పరిగణనలోకి తీసుకుని రోడ్లు, వంతెనల మరమ్మతులకు తక్షణమే నిధులు కేటాయించాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.


